మీకు మీరే.. మాకు మేమే.. | - | Sakshi
Sakshi News home page

మీకు మీరే.. మాకు మేమే..

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

అలాగైతే..

● పొత్తు ధర్మం పాటించకపోతే

ఒంటరిగా పోటీ

● టీడీపీకి జనసేన నేత

తుమ్మల బాబు వార్నింగ్‌

● పెద్దాపురం కూటమిలో

రగులుతున్న రగడ

సామర్లకోట: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కూటమిలో పొత్తుల రగడ ప్రారంభం అయింది. కీలక పదవులన్నీ తమకే కావాలంటున్న టీడీపీ వైఖరిపై మిత్రపక్షమైన జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పొత్తు ధర్మం పాటించకపోతే తమ దారి తాము చూసుకోవడానికి కూడా సిద్ధమని ఆ పార్టీ నేతలు ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఆశ పెట్టి.. జెల్ల కొట్టి..

పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు ఉన్నాయి. సామర్లకోట చైర్‌పర్సన్‌ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయింది. పెద్దాపురం జనరల్‌కు కేటాయించారు. రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే సామర్లకోట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన నాయకులు ఎస్సీ అభ్యర్థిని నిర్ణయించి, ఆ పేరును కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌కు తెలియజేశారు. అయితే, మంగళవారం రాత్రికి రాత్రే సామర్లకోట చైర్మన్‌ సీటు కేటాయింపుపై నిర్ణయం మారిపోయింది. సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు చైర్మన్‌గా పోటీ చేస్తారని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీనికితోడు సామర్లకోటలో వైస్‌ చైర్మన్‌ పదవి కూడా జనసేనకు దక్కదని తేలిపోయింది. దీంతో, పెద్దాపురం పైనే జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్నారు.

ఏడు వార్డులతో సరిపెట్టుకోండి

ఇదే తరుణంలో పెద్దాపురంలో టీడీపీకి చెందిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబురాజు కౌన్సిలర్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. దీనిపై జనసేనను ఏమాత్రం సంప్రదించడం లేదు. దీనిపై ఆ పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ విషయాన్ని జనసేన జిల్లా అధ్యక్షుడు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తుమ్మల బాబు దృష్టికి తీసుకు వెళ్లారు. పెద్దాపురంలో సైతం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు తమకేనని టీడీపీ నాయకులు చెప్పడంతో జనసేన నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెద్దాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా తమకు 12 కేటాయిస్తారని జనసేన ఆశించింది. కానీ, ఏడు వార్డులకు మించి ఇచ్చేది లేదని టీడీపీ నాయకులు కరాఖండీగా చెప్పడంపై జనసేన నాయకులు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో పెద్దాపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో తుమ్మల బాబు బుధవారం సమావేశమయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, అవసరమైతే ఒంటరి పోరుకు సిద్ధమని చెప్పేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నిర్ణయంపై తమ వైఖరి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కార్యకర్తలను సముదాయించారు. జనసేనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎమ్మెల్యే రాజప్పకు గురువారం వివరిస్తామని, అప్పటికీ మార్పు లేకపోతే జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. పొత్తు ధర్మాన్ని పాటించి, తమకు గౌరవప్రదమైనన్ని సీట్లు ఇస్తే కలసి ఉంటామని, లేదంటే తమ దారి తాము చూసుకుంటామని చెప్పకనే చెప్పారు. దీంతో కూటమి ఐక్యతకు బీటలు పెద్దాపురం నుంచే పడతాయా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పటి వరకూ ఒక ప్రధాన పార్టీలో రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి ఇటీవల జనసేనలో చేరడం, అతనికి తగిన ప్రాధాన్యం లభిచని నేపథ్యంలోనే ఈ రగడ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా టీడీపీ కూటమి ధర్మాన్ని పాటించాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పెద్దాపురం, సామర్లకోట చైర్మన్‌ టిక్కెట్లలో ఏదో ఒకటి జనసేనకు కేటాయించాలనే డిమాండ్‌ ఉంది. వివాదం తీవ్రంగా ఉండటంతో పెద్దాపురం చైర్మన్‌ పదవిని తమకు కేటాయించాలనే డిమాండును కూటమి నాయకుల ముందు జనసేన ఉంచుతోంది. ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement