అన్నవరం: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అన్నవరం దేవస్థానంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్కు బ్రేక్ పడింది. పూర్ణకుంభ స్వాగతాలు, వేదాశీర్వచనాలు, శాలువాలు కప్పడం వంటి వాటికి తాత్కాలికంగా తెర పడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి దేవస్థానం అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు ఎటువంటి సమీక్షలూ నిర్వహించరాదు. ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్ రెండో తేదీ వరకూ అమలులో ఉంటుంది. అప్పటి వరకూ ఎన్నికలను ప్రభావితం చేసే ఎటువంటి అధికారిక నిర్ణయాలూ తీసుకోవడానికి వీలు లేదు. ప్రతి నెలా నిర్వహించే ట్రస్ట్ బోర్డు సమావేశాలకు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడింది. ట్రస్ట్ బోర్డు గత సమావేశం సెప్టెంబర్ 30న నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందు అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ సమావేశాలు నిర్వహించేందుకు వీలు లేదు. ఒకవేళ అత్యవసర నిర్ణయం తీసుకోవలసిన అంశాలేవైనా ఉంటే రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కార్తిక మాస ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఎటువంటి ప్రొటోకాల్ ఉండదు. కోనసీమ జిల్లా వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఏడు నెలలుగా సత్యదేవుని సన్నిధిలో ఇన్చార్జి ఈఓగా ఉన్నారు. ఆయన స్థానంలో రెగ్యులర్ ఈఓను నియమిస్తారనే ప్రచారం జరుగుతున్నా ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ ఆ అవకాశం లేదు. వచ్చే రెండు నెలలకు సంబంధించి గత ట్రస్ట్బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని ఈఓ సూర్యచక్రధరరావు తెలిపారు. అలాగే, కార్తిక మాస ఉత్సవాలపై కూడా దేవస్థానం, ప్రభుత్వ శాఖల అధికారుల సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
అన్నవరం దేవస్థానం


