● కొంపముంచుతున్న నిర్లక్ష్యం
● ప్రాణాలు కోల్పోతున్న యువత
● డెత్ స్పాట్‌లుగా వాగులు, వ్యూ పాయింట్లు
చింతూరు: రంపచోడవరం ఏజెన్సీలో విహార యాత్రలు కాస్తా విషాద యాత్రలుగా మిగిలిపోతున్నాయి. ఉల్లాసంగా గడిపేందుకు ఎంతో ఉత్సాహంతో ఇక్కడకు వస్తున్న పర్యాటకులు నిర్లక్ష్యంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా యువత స్నానాల మోజులో బలవుతూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తోంది. ఏజెన్సీలోని జలపాతాలు, సెలయేళ్లలో పడి గత రెండేళ్లలో 30 మంది వరకూ మృతి చెందారు. మారేడుమిల్లి మండలంలో జలతరంగిణి, అమృతధార, దుప్పవలస, పాములేరు; రంపచోడవరం మండలంలో రంప; అడ్డతీగలలో పింజరికొండ; రాజవొమ్మంగిలో చీకుధార; చింతూరు మండలంలో పొల్లూరు, బొడ్డుగూడెం జలపాతాలున్నాయి. చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రెండు వ్యూ పాయింట్లున్నాయి. గుడిసె హిల్స్‌తో పాటు పలు రిసార్ట్‌లు కూడా ఇక్కడున్నాయి. ప్రధానంగా పాములేరు, పొల్లూరు జలపాతం, తులసిపాక వ్యూ పాయింట్ వద్ద జరుగుతున్న ప్రమాదాల్లోనే అధిక సంఖ్యలో యువత బలవుతోంది.
కట్టిపడేసే అందాలెన్నో..
ఎత్తయిన కొండలు, గలగలా పారే సెలయేళ్లు, కొండల మాటున దాగి ఉన్న మబ్బుతెరలు, శీతాకాలంలో కనువిందు చేసే మంచుదుప్పట్ల వంటి అందాలు ఏజెన్సీ సొంతం. నిత్యం బిజీ లైఫ్ గడిపే వేలాది మంది పట్టణణాలు, నగరాల నుంచి ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు వస్తున్నారు. రంపచోడవరం దాటగానే కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు వారిని కట్టిపడేస్తున్నాయి. ఇక్కడకు కుటుంబాలతో కలసి వస్తున్న పర్యాటకులు జలపాతాలు, సెలయేళ్లలో సందడి చేస్తున్నారు. కొంతమంది అడవుల్లో ఉన్న రిసార్ట్‌లలో రాత్రిపూట గడుపుతూ వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
నిర్లక్ష్యంతో ప్రాణాపాయం
పర్యాటకులు జలపాతాలు, సెలయేళ్ల లోతును అంచనా వేయలేక నిర్లక్ష్యంతో వాటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. జలపాతాలు, సెలయేళ్లలో కొన్ని చోట్ల కనబడకుండా లోతైన గోతులుంటున్నాయి. సరిగ్గా ఈత రాని పర్యాటకులు వాటిలో చిక్కుకుని బలవుతున్నారు. దీంతో పాటు కొంతమంది యువత జలపాతాల పైకి వెళ్లి సెల్ఫీలు తీసుకునే క్రమంలో అక్కడి నుంచి కిందనున్న బండరాళ్లపై పడుతున్నారు. అలాగే, వెనుకనున్న నీటితో సెల్ఫీలు తీసుకునేందుకు సెలయేళ్ల అంచుల వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ వాటిలో పడి మృత్యువాత పడుతున్నారు. చాలామంది పర్యాటకులు జలపాతాలు, వ్యూ పాయింట్ల వద్ద మద్యం తాగి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. మద్యం మత్తులో జలపాతాల వద్దనున్న బండరాళ్లపై ఎక్కుతూ.. అక్కడి నుంచి జారి పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
డెత్ స్పాట్లుగా..
తులసిపాక సమీపంలోని వ్యూ పాయింట్, పొల్లూరు జలపాతం, దారాలమ్మ పిక్నిక్ స్పాట్, పాములేరు వాగు డెత్ స్పాట్లుగా మారాయి. ఈ ప్రాంతాల్లోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జలపాతాలు, వాగులు, వ్యూ పాయింట్ల వద్ద ప్రమాదం పొంచి ఉందంటూ పోలీసులు హెచ్చరిక బోర్డులు పెడుతున్నా పర్యాటకులు వాటిని పట్టించుకోకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. ‘మీ విహారయాత్రలో విషాదం జరగకుండా మీ జీవితం మీ చేతుల్లోనే’ అనే క్యాప్షన్‌తో ఏర్పాటు చేసిన ఈ బోర్డుల్లో.. ఆయా ప్రదేశాల్లో బండరాళ్లు, లోతైన గుంతలు, ఊబులు ఉంటాయని, వాగులో స్నానాలు చేయడం, ఈత కొట్టడం, సెల్ఫీలు దిగడం చేయవద్దని సూచించారు. హఠాత్తుగా నీటిప్రవాహం పెరిగే అవకామున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నప్పటికీ పర్యాటకులు పెడచెవిన పెడుతున్నారు. ప్రమాదకరంగా, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల మధ్యలో ఉన్న రాళ్ల పైకి వెళ్తున్న యువకులు పట్టుజారి నీటి ఉధృతికి గల్లంతై మృత్యువాత పడుతున్నారు.
మృతి చెందిన వారి
వివరాలు ఇలా..
రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని పర్యాటక కేంద్రాల వద్ద జరిగిన వివిధ ప్రమాదాల్లో 30 మంది మృతి చెందారు. చింతూరు సర్కిల్‌లోని మోతుగూడెం పోలీసుస్టేషన్ పరిధిలో 13 మంది, డొంకరాయి పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు, చింతూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎటపాక సర్కిల్‌లోని వీఆర్ పురం పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరు మృతి చెందారు. మారేడుమిల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని పాములేరు వాగులో మునిగి ఐదుగురు, జలతరంగిణి వద్ద మునిగి నలుగురు మృతి చెందారు. తాజాగా మంగళవారం చింతూరు మండలం తులసిపాక సమీపాన సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద జరిగిన ఘటనలో విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కోసూరు నీలేష్ (26) వాగులో పడి మృతి చెందాడు.
పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి
మన్యం అందాలు తిలకించేందుకు వస్తున్న పర్యాటకులు వాగులు, జలపాతాల వద్ద స్నానాలకు దిగేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. లోతు తక్కువగా వున్న ప్రాంతాల్లో మాత్రమే స్నానాలు చేయాలి. మద్యం తాగడం, బండరాళ్లపై ఎక్కడం వంటి చర్యలు మానుకోవాలి. ప్రమాదాల నివారణకు జలపాతాలు, వ్యూ పాయింట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నాం.
– గోపాలకృష్ణ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, చింతూరు


