సాధిక్‌ ఖాన్‌ను మరోసారి కస్టడీకి ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

సాధిక్‌ ఖాన్‌ను మరోసారి కస్టడీకి ఇవ్వండి

Sep 16 2026 3:55 AM | Updated on Sep 16 2026 3:55 AM

కోర్టులో సర్పవరం పోలీసుల పిటిషన్‌

కాకినాడ లీగల్‌: పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితుడు షేక్‌ సాధిక్‌ ఖాన్‌ను అదనపు విచారణ కోసం మరోసారి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సర్పవరం పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఈ పిటిషన్‌ సమర్పించారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. సాధిక్‌ ఖాన్‌ రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ప్రస్తుతం రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సర్పవరం పోలీసులు గత నెలలో కోరగా, మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆ మేరకు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకూ పోలీసులు అతడిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. అనంతరం, అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి, తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు జ్యుడీషియల్‌ రిమాండుకు పంపించారు. తాజాగా సాధిక్‌ను మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు.

కార్తిక ఏర్పాట్లు

ఇప్పటి నుంచే చేయాలి

అన్నవరం: వచ్చే కార్తిక మాసంలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు సిబ్బందిని ఆదేశించారు. కార్తిక మాస ఏర్పాట్లపై రత్నగిరిపై సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్షించారు. కార్తిక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేందుకు అవకాశమున్న శని, ఆది, సోమవారాలు, దశమి, ఏకాదశి వంటి పర్వదినాలు, క్షీరాబ్ది ద్వాదశి నాడు సత్యదేవుని తెప్పోత్సవం, పౌర్ణమి నాడు జరిగే గిరి ప్రదక్షిణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్నదానం, ప్రసాదం, వ్రత విభాగాల సిబ్బంది కార్తికానికి అవసరమైన అన్ని రకాల దినుసులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో డిఫ్యూటీ కమిషనర్‌ బాబూరావు, ఈఈ రామకృష్ణ. ఏఈఓలు శ్రీనివాస్‌, బలువు సత్య శ్రీనివాస్‌, అనకాపల్లి ప్రసాద్‌, కృష్ణప్రసాద్‌, ఎలక్ట్రికల్‌ డీఈ జల్లూరి సత్యనారాయణ, డీఈ (సివిల్‌) బీఎస్‌ రాంబాబు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

ముగ్గు పెట్టి నిరసన

కాకినాడ క్రైం: జీజీహెచ్‌లో పని చేస్తున్న పారామెడికల్‌ సిబ్బంది మంగళవారం సాయంత్రం ముగ్గులు పెట్టి నిరసన తెలిపారు. జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు ఆసుపత్రి ఎదుట నినాదాలు చేశారు. తమను రెగ్యులర్‌ చేయాలని, ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ నూరు శాతం గ్రాస్‌ శాలరీ, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని, కాంట్రాక్టు సిబ్బంది మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement