గ్రామాలు మునుగుతున్నా పరిహారం ఇవ్వరేం? | - | Sakshi
Sakshi News home page

గ్రామాలు మునుగుతున్నా పరిహారం ఇవ్వరేం?

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

చింతూరు: కూనవరం, వీఆర్‌ పురం మండలాలకు చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు బుధవారం చింతూరు ఐటీడీఏ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యాన ఈ ధర్నా జరిగింది. కూనవరం మండలం చినార్కూరు, రేపాక, భగవానపురం, కూటూరు, అభిచర్ల, ముల్లూరు, లింగాపురం, రేగులపాడు, కోడేరు, తాళ్లగూడెం, వెంకన్నగూడెం, అయ్యవారిగూడెం గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఐటీడీఏ ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. ఫేజ్‌–1లోనే తమ గ్రామాలు మునుగుతున్నా కాంటూరు లెక్కలు చెప్పి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఆపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా వరద ముంపునకు గురవుతున్న గ్రామాలను పరిగణనలోకి తీసుకుని పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 18 ఏళ్లు నిండిన యువతకు కటాఫ్‌ తేదీతో సంబంధం లేకుండా పునరావాసం కల్పించేనాటి తేదీని పరిగణనలోకి తీసుకుని పరిహారం అందజేయాలని కోరారు.

గ్రామం యూనిట్‌గా పరిహారం ఇవ్వాలి

తమ గ్రామంలోని 104 కుటుంబాలను ముంపులో చేర్చాలంటూ వీఆర్‌ పురం మండలం రామవరానికి చెందిన పోలవరం నిర్వాసితులు ఐటీడీఏ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. గ్రామానికి సంబంధించి 104 కుటుంబాలను ముంపులో చేర్చి గృహాలు, ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలోని కొన్ని కుటుంబాలను ముంపులో చేర్చిన అధికారులు 104 కుటుంబాలను విస్మరించారని, దీనివల్ల వారు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల సాగు భూములతో పాటు పోడు భూములకు కూడా పరిహారం అందజేయాలని కోరారు. ఆందోళనల విషయం తెలుసుకున్న ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ పి.ప్రశాంతి, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌, పీవో శుభం నొఖ్వాల్‌ అక్కడకు చేరుకుని నిర్వాసితులతో చర్చించారు. వారి సమస్యలు పరిశీలించి నిబంధనలకు లోబడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

నిర్వాసితులతో చర్చిస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ప్రశాంతి, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌, పీవో శుభం నొఖ్వాల్‌

ఐటీడీఏ వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్న వీఆర్‌పురం మండలం రామవరం నిర్వాసితులు

ఫ కాంటూరు లెక్కలతో సంబంధం లేదు

ఫ ఐటీడీఏ వద్ద పోలవరం

నిర్వాసితుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement