అంతా మా ఇష్టం! | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం!

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

ప్రభుత్వ భవనంలో టీడీపీ సమావేశాలు

కార్యకర్తలతో ఎమ్మెల్యే కొండబాబు భేటీ

అధికార దుర్వినియోగమేనని విమర్శ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ పార్టీ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయాలను దర్జాగా వినియోగించుకుంటున్నారు. ఇదే రీతిలో కాకినాడలోని స్మార్ట్‌ సిటీ కార్యాలయ భవనంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు బుధవారం టీడీపీ సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని యథేచ్ఛగా ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిసారీ టీడీపీ కార్యకర్తల సమావేశం ప్రభుత్వ వాటర్‌ వర్క్స్‌ సమీపంలోని స్మార్ట్‌ సిటీ భవనంలోనే నిర్వహిస్తూండటం విమర్శలకు తావిస్తోంది. సుమారు రూ.95 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ భవనంలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించడమేమిటని నగర ప్రజలు మండిపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే తంతు సాగుతోందనే ఆరోపణలున్నాయి. పార్టీ సమావేశాలకు రూ.వేలల్లో విద్యుత్‌ బిల్లు, ఇతర నిర్వహణ ఖర్చులు ప్రభుత్వ నిధులతో చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో దీనిపై ప్రశ్నించేందుకు అధికారులు సైతం భయపడుతున్నారు.

ముఖ్యమంత్రికి ఫిర్యాదు

స్మార్ట్‌ సిటీ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా తయారు చేయడం సరైన విధానం కాదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ దూసర్లపూడి రమణరాజు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన కార్యాలయంలో రాజకీయ పార్టీలు క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జ్‌ల పేరిట కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ, దీనిని 365 రోజులూ స్థావరంగా చేసుకోవడం సరికాదని హితవు పలికారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశామని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement