● ముందస్తు సమాచారం లేకుండా స్వాధీనం చేసుకున్నారు
● కాశీ వారాహి అమ్మవారి
ఆలయ ధర్మకర్త ఆవేదన
కరప: ముందస్తు సమాచారం లేకుండా కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారని, దేవదాయ శాఖ అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరమని ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ (దొరబాబు) ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ – రామచంద్రపురం ప్రధాన రహదారిలోని కొరుపల్లిలో ఉన్న ఆలయం వద్ద బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాను లేకపోయినా దేవదాయ శాఖ అధికారులు మంగళవారం ఆలయానికి వచ్చి, స్వాధీనం చేసుకుని, గోడలకు స్వాధీన నోటీసులు అతికించి వెళ్లడం తనను బాధించిందని అన్నారు. సమస్య ఏదైనా ఉంటే ముందుగా తమకు సమాచారం ఇచ్చి చర్చించి, పరిష్కరించే అవకాశం కల్పించి ఉంటే బాగుండేదన్నారు. చాలామంది కాశీ వెళ్లలేక వారాహి మాతను దర్శించుకోలేకపోతున్నారని, ఈ ప్రాంత భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించాలన్న తన తల్లి అమ్మాజీ కోరిక మేరకు 110 గజాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించానని చెప్పారు. మిగిలిన స్థలాన్ని తన కుమారుడు ఆసుపత్రి నిర్మించేందుకు కొనుగోలు చేశానని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో ఆలయాలుండగా దేవదాయ శాఖ దీనినే స్వాధీనం చేసుకోవడమేమిటని దొరబాబు ప్రశ్నించారు. ఈ ఆలయంలో ఎటువంటి రుసుం వసూలు చేయకుండానే ఉచిత దర్శనాలు, సామూహిక కుంకుమ పూజలు, అన్నదానం, చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆలయం నిర్మించిన 29 వారాల్లో కుంకుమ పూజలు, గుప్త నవరాత్రులు నిర్వహించి, ఇప్పటి వరకూ 2 లక్షల మందికి పైగా అన్నదానం చేశామని వివరించారు. దేవదాయ శాఖ కూడా భక్తులకు ఉచిత దర్శనం కల్పించాలని, ఇతర పూజా కార్యక్రమాలు కూడా యథావిధిగా కొనసాగించాలని దొరబాబు కోరారు.


