పేమెంటుపై.. వాయింపు | - | Sakshi
Sakshi News home page

పేమెంటుపై.. వాయింపు

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

డిజిటల్‌ ఇండియా అన్నారు. నగదు లేని సమాజమని గొప్పలు చెప్పారు. పెద్దపెద్ద కార్పొరేట్‌ మాల్స్‌ నుంచి రోడ్డు పక్కన చిరు వ్యాపారాల వరకూ.. ఏది కొనుగోలు చేయాలన్నా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, నగదు బదిలీ చేయవచ్చన్నారు. సేవలు ఉచితమంటూ ఎర వేశారు. అలా ప్రజలకు అలవాటు చేసి.. చేసి.. ఫోన్‌ లేనిదే బతుకు నడవని స్థితికి తెచ్చారు. ఇప్పుడు అదే ఫోన్‌ పేమెంట్లపై చార్జీల కత్తి పెడుతున్నారు. వ్యాపారుల పైనే ఈ చార్జీలు అని ఎన్‌పీసీఐ చెబుతున్నప్పటికీ..

అంతిమంగా తమ జేబుకే చిల్లు పడుతుందనే ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది.

యూపీఐ సేవలపై ఇకపై వడ్డన

రూ.2 వేలకు పైబడిన వ్యాపార లావాదేవీలపై అదనపు చార్జీలు

వచ్చే నెల 15 నుంచి అమలు

వ్యాపారులు, వినియోగదారుల్లో ఆందోళన

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): నగదు రహిత లావాదేవీలకు మార్గం సుగమం చేసిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) విధానంలో కొత్తగా మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) అమలులోకి రానుండటంపై ఇటు వ్యాపారులు, అటు వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యూపీఐ యాప్‌ల ద్వారా ప్రజలు సులభంగా చెల్లింపులు చేసుకుంటున్నారు. అయితే, అక్టోబర్‌ 15 నుంచి రూ.2 వేలకు పైబడిన కొన్ని వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్‌ విధించనున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది.

ప్రతి నెలా 39 లక్షల యూపీఐ లావాదేవీలు

జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా సగటున 39 లక్షల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. గత నెలలో యూపీఐ లావాదేవీల ద్వారా జిల్లాలో రూ.150 కోట్లు పైగా నగదు బదిలీ జరిగింది. ఇందులో అధికంగా వ్యాపారాలకు సంబంధించిన యూపీఐ లావాదేవీలే ఉన్నాయని బ్యాంకు వర్గాలు బెబుతున్నాయి. కరోనాకు ముందు ప్రజలు ఏం కావాలన్నా డబ్బులతోనే కొనుగోలు చేసేవారు. కరోనా తర్వాత యూపీఐ లావాదేవీలు అధికంగా పెరిగాయి. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం వడ్డన మొదలు పెట్టడంతో వినియోగదారుల్లో అయోమయం నెలకొంది.

వాయింపు ఇలా..

● యూపీఐ ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలకు ఎంత మొత్తమైనా సరే ఎండీఆర్‌ చెల్లించనవసరం లేదు.

● ప్రతి నెలా యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రూ.లక్ష వరకూ స్వీకరించే అర్హత కలిగిన చిన్న వ్యాపారులకు కూడా జీరో ఎండీఆర్‌ కొనసాగనుంది.

● వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపుల్లో కూడా రూ.2 వేల వరకు ఎలాంటి ఎండీఆర్‌ ఉండదు.

● రూ.2 వేలకు పైబడి పెద్ద వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధిస్తారు.

● రూ.75 వేలు, అంతకు పైబడిన వ్యాపార లావాదేవీలపై రూ.300కే చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు యూపీఐ ద్వారా రూ.10 వేలు చెల్లిస్తే 0.4 శాతం ప్రకారం ఎండీఆర్‌ రూ.40 చెల్లించాలి. రూ.50 వేలకు రూ.200 చార్జీ ఉంటుంది.

● రైల్వే టికెట్ల బుకింగ్‌, టెలికం సేవలు, బీమా ప్రీమియం, ఇంధనం, వ్యవసాయ పెట్టుబడి వంటి రంగాల్లో రూ.2 వేలకు పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతానికి బదులు ప్రతి లావాదేవీపై రూ.5 ఫ్లాట్‌ ఎండీఆర్‌ విధించనున్నారు. దీనిపై కూడా సంబంధిత వినియోగదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

● యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ చార్జీని వ్యాపారే భరించాల్సి ఉంటుందని, వినియోగదారుల నుంచి వసూలు చేయరాదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆమేరకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించింది.

● అయితే, ఈ భారాన్ని వ్యాపారులు ఎందుకు భరిస్తారని, ఆ చార్జీలు కూడా తమపైనే మోపుతారని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు రూ.2 వేల వరకూ ఉచితం అని అంటున్నా.. రానున్న రోజుల్లో ప్రతి లావాదేవీపై కూడా చార్జీ విధించవచ్చనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

వ్యాపారులపై అదనపు భారం

ఇప్పటి వరకూ యూపీఐ చెల్లింపులు పూర్తి ఉచితం కావడంతో చిన్నా పెద్దా వ్యాపారులందరూ విస్తృతంగా క్యూఆర్‌ కోడ్‌లు వినియోగిస్తున్నారు. ఇటువంటి దుకాణాలు, రెస్టారెంట్లు, ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు, ఇతర వ్యాపారులకు కొత్త ఎండీఆర్‌ అదనపు భారంగా మారనుంది. ముఖ్యంగా అధిక విలువ కలిగిన లావాదేవీలు ఎక్కువగా జరిగే వ్యాపారాల్లో ఈ వ్యయం పెరిగే అవకాశముందని చెబుతున్నారు. తద్వారా తమ లాభాలపై ప్రభావం పడుతుందేమోనని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధిక మొత్తంలో చెల్లింపులు చేసే వ్యాపారులకు మాత్రం వ్యయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్టు ఈ అదనపు వ్యయాన్ని వ్యాపారులే భరిస్తారా లేక వస్తువులు, సేవల ధరల్లో ఏదైనా మార్పు చేసి, ఆ భారాన్ని వినియోగదారులపైనే మోపుతారా అనేది వేచి చూడాలి. కొత్త ఎండీఆర్‌ విధానంతో యూపీఐ లావాదేవీలు తగ్గవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

సత్యదేవుని సన్నిధిలోనూ వడ్డన!

అన్నవరం దేవస్థానంలో

90 శాతం యూపీఐ చెల్లింపులే

ఆన్‌లైన్‌ పేమెంట్ల ద్వారా

ప్రతి నెలా రూ.3 కోట్లు పైగా రాబడి

భారం.. భక్తుల పైనా!

భగవంతుని పైనా!

కానరాని స్పష్టత

అన్నవరం: యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ వడ్డన అన్నవరం దేవస్థానంపై కూడా ఉండనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్లు ఆ అదనపు చార్జీ భగవంతునిపై (దేవస్థానం) పడుతుందా.. లేక భక్తుల పైనా అనే అంశంపై ఇంకా స్పష్టత రావడం లేదు. రూ.వెయ్యికి మించిన గదుల అద్దె వంటి వాటికి భక్తులు ఇప్పటికే 5 శాతం జీఎస్‌టీ చెల్లిస్తున్నారు. జీఎస్‌టీలో మినహాయింపు లేదు కాబట్టి యూపీఐ చెల్లింపులపై కూడా దేవస్థానం ఎండీఆర్‌ చెల్లించాల్సి ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం దేవస్థానంలో స్వామివారి వ్రతాల టికెట్లు, ప్రసాదం, వసతి గదుల రిజర్వేషన్‌ నుంచి దర్శనం వరకూ అన్నింటికీ ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. అందులోనూ యూపీఐ పేమెంట్లే ఎక్కువగా ఉన్నాయి. ఆన్‌లైన్‌ చెల్లింపులు సాధారణ రోజుల్లో రూ.10 లక్షల వరకూ ఉంటే, శని, ఆదివారాలు, ఏకాదశి వంటి పర్వదినాల్లో రూ.25 లక్షల వరకూ ఉంటున్నాయి. ఈవిధంగా ప్రతి నెలా సుమారు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఆన్‌లైన్‌ పేమెంట్లు జరుగుతున్నాయి.

వీటిపై ఎండీఆర్‌ పడే చాన్స్‌

● యూపీఐ ద్వారా భక్తులు జరిపే చెల్లింపుల్లో ఎక్కువ రూ.2 వేల లోపే ఉంటున్నాయి. సత్యదేవుని ఆయుష్య హోమానికి రూ.2,116, రథసేవకు రూ.2,500 చొప్పున టికెట్ల రేట్లు ఉన్నాయి. తాజా యూపీఐ నిబంధనల ప్రకారం వీటిపై 0,4 శాతం ఎండీఆర్‌ చెల్లించాల్సి ఉంటుంది.

● దేవస్థానంలోని కొన్ని సత్రాల్లో సూట్‌ రూములు, వ్యక్తిగత కాటేజీల అద్దెలు రూ.2 వేలకు పైబడి ఉన్నాయి. వీటికి సంబంధించిన యూపీఐ చెల్లింపులపై కూడా ఎండీఆర్‌ కట్టాలనే వినిపిస్తోంది.

● శివసదన్‌ సత్రంలో 20 సూట్‌ రూములున్నాయి. ఒక్కో సూట్‌ అద్దె రూ.2,500. ఇప్పటికే ఈ అద్దె మీద భక్తులు జీఎస్‌టీ రూ.125 చెల్లిస్తున్నారు. ఇప్పుడు యూపీఐ పేమెంట్‌ చేస్తే అదనంగా రూ.10 వరకూ ఎండీఆర్‌ చెల్లించాల్సి ఉంటుంది.

● డోనార్‌ కాటేజీలకు కూడా రూ.7 వేలు నుంచి రూ.8 వేల వరకు రోజువారీ అద్దె వసూలు చేస్తున్నారు. వీటికి కూడా యూపీఐ ద్వారా చెల్లిస్తే ఎండీఆర్‌ చెల్లింపు తప్పనిసరి అవుతుంది.

● మ్యారేజీ హాళ్ల అద్దె రూ.3 వేల నుంచి రూ.7,500 వరకు, వివాహాలు చేసుకునే స్థలాల అద్దెలు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకూ ఉన్నాయి. వీటిపై ఇప్పటికే 5 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. వీటికి కూడా యూపీఐ ద్వారా చెల్లిస్తే ఎండీఆర్‌ పడక తప్పదు.

● నిబంధనల ప్రకారం ఈ ఎండీఆర్‌ను దేవస్థానమే చెల్లిస్తుందా లేక ఆ భారాన్ని ఏదో ఒక రూపంలో భక్తుల పైనే మోపుతుందా అనే అంశం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.

అన్నవరం దేవస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement