కాశీ వారాహి ఆలయం.. దేవదాయ శాఖ పరం | - | Sakshi
Sakshi News home page

కాశీ వారాహి ఆలయం.. దేవదాయ శాఖ పరం

Sep 16 2026 3:55 AM | Updated on Sep 16 2026 3:55 AM

కరప: కాకినాడ – రామచంద్రపురం ప్రధాన రహదారిలోని కొరుపల్లిలో కొలువైన కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవదాయ శాఖ మంగళవారం స్వాధీనం చేసుకుంది. సింగల్‌ ట్రస్టీగా సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం గ్రేడ్‌–1 ఈఓ రాపాక శ్రీనివాస్‌ను నియమించారు. కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన చిక్కాల వీర వెంకట సత్యనారాయణ (దొరబాబు) సొంత నిధులతో ఆరు నెలల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య రాముని విగ్రహాన్ని చెక్కిన శిల్పితో కాశీ వారాహి అమ్మవారి విగ్రహాన్ని చెక్కించి, ఇక్కడ ప్రతిష్ఠించారు. స్వల్ప కాలంలోనే ఈ ఆలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢ మాసంలో నిర్వహించిన గుప్త నవరాత్రులతో ఆలయం మరింత ఖ్యాతికెక్కింది. భక్తుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం, రావులపాలెం ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు సైతం ఇక్కడకు నడుపుతున్నారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో ఈ ఆలయంలోని నిధులు దుర్వినియోగమవుతున్నట్టు కొందరు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఆధ్వర్యాన అధికారుల బృందం ఈ ఆలయాన్ని పరిశీలించింది. అనంతరం దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ రమేష్‌బాబు ఆదేశాల మేరకు కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని ఆ శాఖ స్వాధీనం చేసుకుంది. ఆలయ సింగిల్‌ ట్రస్టీగా ఈఓ రాపాక శ్రీనివాస్‌తో కాకినాడ డివిజన్‌ ఇన్‌స్పెపక్టర్‌ వడ్డి ఫణీంద్ర కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయంలోని హుండీలకు సీళ్లు వేసి, రసీదు పుస్తకాలు స్వాధీనం చేయాలని ధర్మకర్త దొరబాబుకు నోటీసు ఇచ్చారు. ఇక నుంచి ఈ ఆలయాన్ని దేవదాయ శాఖే పర్యవేక్షిస్తుందని ఈఓ శ్రీనివాస్‌ తెలిపారు. దేవదాయ శాఖ ఈఓలు ఎం.మురళీ వీరభద్రరావు, వేణుగోపాల్‌, బాదం వాసు, డి.శ్రీనివాసరావు, బీవీఆర్‌ చౌదరి, సోమరాజు, భానుగుడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నిధుల దుర్వినియోగం అబద్ధం

నా సొంత స్థలంలో, నా సొంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మించాను. ఇక్కడ నిధులు దుర్వినియోగమయ్యాయన్నది అవాస్తవం. ప్రతి వారం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేస్తున్నాం. ప్రత్యేక కార్యక్రమాల్లో మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నాం.

– చిక్కాల వీర వెంకట సత్యనారాయణ,

ఆలయ ధర్మకర్త

ఫ స్వాధీనం చేసుకున్న అధికారులు

ఫ సింగిల్‌ ట్రస్టీగా సర్పవరం భావనారాయణ స్వామి ఆలయ

ఈఓ ప్రమాణ స్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement