మిల్లుల్లో తనిఖీలు.. అధికారుల నిఘా
● సీఎంఆర్ బియ్యం ఎప్పుడిస్తారు?
● 47,500 టన్నులు పెండింగ్‌లోనే
● గడువు ముగుస్తున్నా పట్టించుకోని మిల్లర్లు
మిల్లులకు నోటీసులు జారీ
సీఎంఆర్ బియ్యం సరఫరా చేయాల్సిన మిల్లులకు నోటీసులు జారీ చేశాం. ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నద్ధం కావడానికి ముందే రబీ సీఎంఆర్‌ను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నిర్లక్ష్యం వహించే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మిల్లుల్లో నిల్వలు, ధాన్యం మిల్లింగ్ పరిస్థితి, సీఎంఆర్ సరఫరా వివరాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వానికి అందాల్సిన బియ్యాన్ని నిర్ణీత గడువులోగా అందించకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– ఆనందరావు, జిల్లా మేనేజర్,
పౌరసరఫరాల సంస్థ
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)గా మార్చి ప్రభుత్వానికి అప్పగించాల్సిన విషయంలో కొందరు రైస్ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రబీ సీజన్‌లో సేకరించిన ధాన్యానికి సంబంధించి ఇప్పటికీ 47,500 టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందాల్సి ఉంది. పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ కొందరు మిల్లర్లు సీఎంఆర్ బియ్యం సరఫరాలో జాప్యం చేస్తుండటంపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సొమ్ములు చెల్లించేందుకు పౌరసరఫరాల సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అప్పులు, వడ్డీలతో నిధులు సమకూర్చి చెల్లింపులు చేపడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద రైస్ మిల్లులకు అప్పగించి, మిల్లింగ్ అనంతరం నిర్ణీత పరిమాణంలో బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించే విధానం అమల్లో ఉంది.
భారీ మొత్తంలో పెండింగ్‌లోనే..
గత రబీ సీజన్‌లో జిల్లాలో రైతుల నుంచి సుమారు 2.32 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసి వివిధ రైస్ మిల్లులకు సీఎంఆర్ కోసం కేటాయించింది. దీనికి సంబంధించి సుమారు 1.22 లక్షల టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందాల్సి ఉండగా, ఇప్పటివరకు 84,800 టన్నుల వరకు మాత్రమే మిల్లర్లు సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంకా సుమారు 47,500 టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. దీని విలువ సుమారు రూ.218 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో సీఎంఆర్ బియ్యం పెండింగ్‌లో ఉండటంతో పౌరసరఫరాల సంస్థ ఆర్థిక వనరులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
94 మిల్లులు.. 22 మాత్రమే పూర్తి
జిల్లాలో మొత్తం 94 రైస్ మిల్లులు సీఎంఆర్ ప్రక్రియలో భాగస్వాములుగా ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 23 మిల్లులు మాత్రమే వంద శాతం సీఎంఆర్ బియ్యాన్ని సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 72 మిల్లుల్లో కొన్నింటి నుంచి బియ్యం సరఫరా పూర్తికాకపోవడంతో పెండింగ్ పరిమాణం భారీగా పెరిగింది. సీఎంఆర్ బియ్యం సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లకు జిల్లా అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ సీఎంఆర్‌ను పూర్తిగా సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని మిల్లుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు.
అప్పుడు ఎగబడి..
ఇప్పుడు కుంటిసాకులు..
రబీ సీఎంఆర్ బియ్యం డెలివరీ, ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ గోడౌన్‌లకు తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రబీ ధాన్యం మిల్లర్లకు ఇచ్చి సుమారు నాలుగు నెలలు కావస్తోంది. అయినప్పటికీ బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రబీ ధాన్యం దక్కించుకోవడానికి మిల్లర్లు ఎగబడ్డారు. తీరా ధాన్యం తీసుకున్నాక మిల్లింగు చేయడానికి అనేక కుంటి సాకులు చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతుంది. సకాలంలో బియ్యం డెలివరీ కాకపోవడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. కొందరు మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని దొడ్డిదారిన విక్రయించి, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రైస్ మిల్లర్
పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సీఎంఆర్ రైస్ మిల్లులపై ప్రత్యేక దృష్టి సారించారు. మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తూ కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ధాన్యం నిల్వలు ప్రస్తుతం ఉన్నాయా, వాటిని మిల్లింగ్ చేశారా, మిల్లింగ్ చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం ప్రభుత్వానికి ఎందుకు సరఫరా కాలేదు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. గతంలో సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి ప్రైవేటుగా తరలించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం, మిల్లింగ్ చేసిన బియ్యం, ప్రభుత్వానికి అందించిన పరిమాణం తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు త్వరలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో రబీ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ బియ్యం మొత్తం సరఫరా చేయాల్సిన బాధ్యత మిల్లర్లపై ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రబీ సీఎంఆర్ పెండింగ్‌లో ఉంచి తిరిగి ఖరీఫ్ సీజన్‌లో సీఎంఆర్ కేటాయింపులు పొందేందుకు ప్రయత్నించే మిల్లులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించారు.


