ఇష్టమైన వాడి కోసం భర్తను వదిలొచ్చి.. | - | Sakshi
Sakshi News home page

ఇష్టమైన వాడి కోసం భర్తను వదిలొచ్చి..

Aug 31 2026 12:14 AM | Updated on Aug 31 2026 12:14 AM

అనుమానిస్తున్నాడని ఆత్మహత్య

బంజారాహిల్స్‌లో ఘటన

బంజారాహిల్స్‌: ఇష్టమైన వాడి కోసం కట్టుకున్న భర్తను వదిలి వచ్చిన ఓ యువతి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అనుమానపు భర్తతో వేగలేక, అవమానాలు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌ కొట్టూర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరానికి చెందిన ఎం.రాజేశ్వరి (23) వివాహం 2023లో ముత్యాలరావుతో జరిగింది. అదే ఏడాది హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–2 ఇందిరానగర్‌లో నివసించే అంతటి సాయికుమార్‌ (28)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ముత్యాలరావుతో పెళ్లి జరిగిన నెల రోజులకే ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌లో సాయికుమార్‌కు రాజేశ్వరి పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. అదే ఏడాది జూన్‌లో సాయికుమార్‌ ప్రేమించిన యువతి రాజేశ్వరి ఇంటికి వెళ్లి ఆమెను ఇందిరానగర్‌ తీసుకువచ్చి కాపురం పెట్టాడు. ఓ నగల షాపులో పనిచేస్తున్న రాజేశ్వరిని నెల రోజుల తర్వాత జూలైలో మొదటి భర్త ముత్యాలరావు వచ్చి తీసుకువెళ్లాడు. ఆగస్టు 13న సాయికుమార్‌ మళ్లీ వెళ్లి ఆమెను తిరిగి హైదరాబాద్‌ తీసుకువచ్చి ఆగస్టు 16న ఇందిరానగర్‌లోని అద్దె గదిలో తాళి కట్టాడు. అప్పటి నుంచి ఇద్దరూ భార్యాభర్తల్లాగా కాపురం పెట్టారు. నగల షాపులో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి గత నాలుగైదు నెలల నుంచి ఇన్‌స్ట్రాగామ్‌లో మరో యువకుడితో చాటింగ్‌ చేస్తుండడం, ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని సాయికుమార్‌ గుర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. వేరే యువకుడితో ఆమె చేస్తున్న చాటింగ్‌ వల్ల ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఈ నెల 25వ తేదీ ఉదయం ఇదే విషయంలో రాజేశ్వరి, సాయికుమార్‌ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అనుమానంతో సాయికుమార్‌ ఆమెను తిట్టడంతో పాటు తీవ్రంగా వేధించి మానసికంగా హింసించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి డ్యూటీలకు వారు వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంలో మళ్లీ ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదానికి దారితీసింది. ఈ అనుమానాన్ని, అవమానాన్ని భరించలేక రాజేశ్వరి బాత్‌రూమ్‌లోకి వెళ్లి షవర్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంట గడిచినా ఆమె బాత్‌రూమ్‌లో నుంచి బయటకు రాకపోయేసరికి సాయికుమార్‌ తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా షవర్‌ కొక్కానికి వేలాడుతూ కనిపించింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడు సాయికుమార్‌పై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement