రత్నగిరిపై జోరుగా వివాహాలు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై జోరుగా వివాహాలు

Aug 31 2026 12:14 AM | Updated on Aug 31 2026 12:14 AM

రామాలయం వద్ద విశ్రాంతి మండపంలో వివాహాలు జరుగుతున్న దృశ్యం

ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రత్నగిరిపై సాధారణంగా రాత్రి, తెల్లవారుజామున ముహూర్తాల్లోనే వివాహాలు జరుగుతాయి. ఆదివారం మాత్రం ఉదయం 11 గంటల ముహూర్తంలో వివాహాలు జరగడంతో అందరూ ఆసక్తితో తిలకించారు. రత్నగిరి రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడం విశేషం. శ్రావణ మాసం సెప్టెంబర్‌ 11వ తేదీ వరకు ఉండగా, వివాహ ముహూర్తాలు మాత్రం ఆరో తేదీ వరకు మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్‌ 12 నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. ఆ మాసంలో వివాహాది శుభకార్యాలు జరగవు. అక్టోబర్‌ 11వ తేదీ నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంబం కానుండటంతో మరలా వివాహాలు జరుగుతాయి.

పోటెత్తిన భక్తులు

సత్యదేవుని ఆలయానికి ఆదివారం కూడా భక్తులు పోటెత్తారు. రత్నగిరి సత్యదేవుని సన్నిధిన, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు సత్యదేవుని ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారి వ్రతాలాచరించి సత్యదేవుని దర్శించారు. దీంతో క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేశారు. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది స్వామివారి ఉచిత అన్నప్రసాదం స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement