మరో మూడు రోజులే.. | - | Sakshi
Sakshi News home page

మరో మూడు రోజులే..

Jun 28 2026 12:16 AM | Updated on Jun 28 2026 12:16 AM

గ్యాస్‌ లబ్ధిదారులకు ఈ–కేవైసీ తప్పనిసరి

ఈ నెల 30 వరకు మాత్రమే గడువు

చేయించుకోకుంటే ఇబ్బందులు

ఉమ్మడి జిల్లాలో 19,14,791 ఎల్‌పీజీ కనెక్షన్లు

75 శాతమే పూర్తయిన ప్రక్రియ

కపిలేశ్వరపురం: గ్యాస్‌ కనెక్షన్‌ కలిగిన వినియోగదారులందరూ ఈ నెల 30వ తేదీలోపు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్‌ నో యువర్‌ కస్టమర్‌ (ఈ–కేవైసీ) చేయించుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అక్రమ కనెక్షన్లు తొలగించేందుకు ఈ ప్రక్రియ చేపట్టామని చెబుతోంది. అయితే ఈ విషయంపై గ్యాస్‌ వినియోగదారులందరికీ పూర్తిస్థాయిలో సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ–కేవైసీ విషయం తెలియని వారందరూ నష్టపోయే ప్రమాదం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 52, కాకినాడ జిల్లాలో 45, కోనసీమ జిల్లాలో 27 ఏజెన్సీల ద్వారా గ్యాస్‌ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి.

ఎందుకంటే..

ఫ గ్యాస్‌ రాయితీ దుర్వినియోగానికి, అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఈ–కేవైసీని తప్పనిసరి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 30వ తేదీ లోపు గ్యాస్‌ ఏజెన్సీ ద్వారా, ఆన్‌లైన్‌లో కానీ ఈ–కేవైసీ చేయించుకోవాలి.

ఫ లేకపోతే గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ప్రభుత్వ రాయితీ నిలిచిపోతుంది. గ్యాస్‌ సరఫరాను నిలిపివేయడం, సిలిండర్‌ను రద్దు చేయడమూ చేసే అవకాశం ఉండొచ్చు.

ఫ సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీలో ఈ–కేవైసీని ఉచితంగా చేస్తారు. అవగాహన ఉంటే ఆన్‌లైన్‌లో కూడా ఇంటిలో ఉండే చేసుకోవచ్చు.

ఫ ప్లే స్టోర్‌ నుంచి సంబంధిత గ్యాస్‌ కంపెనీ అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. గ్యాస్‌ కనెక్షన్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌తో యాప్‌లో లాగిన్‌ అవ్వాలి.

ఫ ఈ– కేవైసీ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ఫేస్‌ స్కానింగ్‌ ద్వారా లేదా మొబైల్‌కి వచ్చే ఓటీపీ ద్వారా వినియోగదారు గుర్తింపును ధ్రువీకరించి సబ్మిట్‌ చేయాలి. 48 గంటల్లోపు ప్రక్రియపూర్తవుతుంది.

సామాన్యుడిపై భారం

కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై గ్యాస్‌ సిలిండర్‌ ధరల భారాన్ని మోపుతోంది. గృహ వినియోగ సిలిండర్‌పై ఈ ఏడాది మార్చి 7న రూ.60, ఈనెల 7న రూ.29 పెంచడంతో సిలిండర్‌ ధర రూ.971కి పెరిగింది. డెలివరీ ఖర్చులతో రూ.వెయ్యి అవుతోంది. వాణిజ్య సిలిండర్‌ ధరను గత మూడు నెలల్లో మూడు సార్లు పెంచడంతో ప్రస్తుతం దాని ధర రూ.3,406కి చేరింది. దీంతో చిరు వ్యాపారులు ప్రత్యక్షంగానూ, వారి వద్ద పదార్థాలు కొనుగోలు చేసే వినియోగదారులు పరోక్షంగానూ తీవ్ర భారాన్ని మోస్తున్నారు. ఉజ్వల పథకం ప్రారంభంలో సబ్సిడీపై ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఒక్కో సిలిండర్‌కు రూ.300 రాయితీని అందజేసింది. ఆ తర్వాత కాలంలో ఆ సంఖ్యను 9కి ప్రస్తుతం 4కి కుదించింది. కొత్త కనెక్షన్ల కోసం తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 10 వేల మంది రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఏడాది కాలంగా గ్యాస్‌ బుక్‌ చేసుకోకపోతే కనెక్షన్‌ ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

గ్యాస్‌ వినియోగదారుల వివరాలు

జిల్లా గ్యాస్‌ కనెక్షన్లు

తూర్పుగోదావరి 6,92,825

కాకినాడ 6.50,000

కోనసీమ 4,79,563

పోలవరం 92,403

మొత్తం 19,14,791

సమాచారం లేక..

గ్యాస్‌ కనెక్షన్‌ లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియ ఇప్పటి వరకూ 75 శాతం మాత్రమే పూర్తయ్యింది. చేయించుకోని వారిలో చాలామందికి దీని సమాచారం తెలియదు. తెలిసిన వారిలో కొందరు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లడంతో సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీని సంప్రదించలేని పరిస్థితి ఏర్పడింది. తెలిసిన వారు ఆన్‌లైన్‌లో చేసుకునే వీలు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన సాంకేతిక అవగాహన వారికి లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement