రత్నగిరిపై నీటి కొరత | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై నీటి కొరత

Jun 28 2026 12:16 AM | Updated on Jun 28 2026 12:16 AM

శనివారం మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకూ భక్తుల అవస్థలు

విద్యుత్‌ లేకపోవడమే కారణమంటున్న అధికారులు

అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో శనివారం నీటి సమస్య ఏర్పడింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో భోజనం చేసిన భక్తులు చేతులు కడుక్కోవడానికి కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మొక్కలకు నీరు పోసే ట్యాంకర్‌ను తీసుకొచ్చి టబ్‌లలో ఆ నీటిని నింపారు. దేవస్థానం వాటర్‌ వర్క్స్‌ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే విమర్శలు వినిపించాయి. దేవస్థానంలో నాలుగు లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్‌ ట్యాంకులు ఉన్నాయి. వీటికి నిరంతరం మోటార్ల ద్వారా నీటిని ఎక్కించాలి. అయితే ఏపీఈపీడీసీఎల్‌ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ నిలిచిపోవడంతో జనరేటర్‌ ద్వారా నీటిని దేవస్థానానికి సరఫరా చేశామని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రికి వాటర్‌ ట్యాంకుల్లో సగం వరకు మాత్రమే నీరు నిల్వ ఉందని, దేవస్థానంపై పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడంతో భక్తులు, సత్రాల్లోని పెళ్లిళ్ల బృందాలు ఈ నీటిని వాడేశాయన్నారు. అలాగే శనివారం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఒక్కసారిగా నీటి వినియోగం పెరిగిందని, దీనివల్ల కొరత ఏర్పడిందన్నారు. జనరేటర్‌ ద్వారా నీటిని తోడినప్పటికి ఎప్పటికప్పడు వాటర్‌ ట్యాంకులు ఖాళీ అయిపోయాయని వివరించారు. మధ్యాహ్నం నుంచే వివిధ సత్రాల్లో కూడా కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో వాటర్‌ టిన్నుల ద్వారా సరఫరా చేసినట్టు తెలిపారు.

అన్నదాన పథకంలో..

అన్నదాన పథకంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉదయం పది గంటలకే అక్కడ నీటి సమస్య ఏర్పడింది. వంటలు చేయడానికి వాటర్‌ టిన్నులు తేవాల్సి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి చేతులు కడుక్కోవడానికి కూడా కుళాయిల ద్వారా నీరు రాలేదు. దీంతో అన్నదానం ఏఈఓ బలువు సత్యశ్రీనివాస్‌ మొక్కలకు నీటిని సరఫరా చేసే వాటర్‌ ట్యాంకర్‌ను తీసుకువచ్చి అన్నదానం హాలు బయట పెట్టి టబ్‌లలో నీటిని నింపించారు. మధ్యాహ్నం మూడు గంటలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement