తూరు్పన కాసుల పంచాయితీ! | - | Sakshi
Sakshi News home page

తూరు్పన కాసుల పంచాయితీ!

Jun 28 2026 12:16 AM | Updated on Jun 28 2026 12:16 AM

శానిటేషన్‌ పేరుతో దారి మళ్లింపు

రూ.6.01 కోట్లు బిల్లుల మాటేమిటి

కమీషన్లకు కక్కుర్తిపడ్డ ఈఓలు

203 పంచాయతీల్లో దుర్వినియోగం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: గ్రామ పంచాయతీల్లో డ్రా చేసిన రూ.6.5 కోట్ల బిల్లులపై పెద్ద పంచాయితీయే నడుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 200 పైబడి గ్రామ పంచాయతీల్లో ఈ బిల్లుల బాగోతం చర్చనీయాంశమైంది. బిల్లుల విడుదలలో కొందరు ఈఓలు చేతి వాటం ప్రదర్శించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రామ పంచాయతీల్లో ఎటువంటి బిల్లులు డ్రా చేయవద్దంటూ గత ఏడాది డిసెంబరులో పంచాయతీరాజ్‌ శాఖ డైరక్టర్‌ కృష్ణతేజ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి పంచాయతీల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. పల్లెల్లో మౌలిక వసతులు కూడా కల్పించడం లేదంటూ సదరు అధికారులపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. దీంతో ఆర్థికంగా స్థితిమంతులైన సర్పంచ్‌లు చిన్న చితకా పనులు చేయించేవారు. ఇంతలో ఏప్రిల్‌లో పంచాయతీ పాలకవర్గాలు రద్దు కావడంతో సర్పంచ్‌లు పదవులు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో గ్రామాల్లో చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదని, చివరకు పారిశుద్ధ్య వాహనాల నిర్వహణ కొరవడి అగమ్యగోచరంగా తయారైంది. ఆ వాహనాల నిర్వహణకు కనీసం ఇంధనం సొమ్ములు లేవని పంచాయతీ అధికారులు ఉన్నత అధికారులకు మొరపెట్టుకున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించడంతో పాటు, పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ శాఖ డైరెక్టర్‌ కృష్ణతేజ బిల్లుల మంజూరులో కొంత వెసలుబాటు కల్పిస్తూ డీపీఓలకు ఆదేశాలు జారీచేశారు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని గ్రామ పంచాయతీల్లో ఈఓలు 5శాతం కమీషన్లకు కక్కుర్తిపడి బిల్లులు మంజూరు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చెత్త తరలింపు వాహనాలకు డీజిల్‌, పెట్రోలు బిల్లుల మంజూరుకు అనుమతించడమే వారి పాలిట కల్పతరువైంది. ఇదే అదనుగా ఈఓలు చేతివాటం చూపారనే విమర్శలు వెల్లువెత్తాయి. పంచాయతీల్లో సాధారణ నిధుల నుంచి నిర్దేశిత వాహనాలకు ఆయిల్‌ బిల్లులే కాకుండా ఇతర బిల్లులు, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పాత బిల్లులు కూడా డ్రా చేశారని తెలియవచ్చింది. ఈ బాగోతంపై పంచాయతీల వారీగా గడచిన రెండు నెలల కాలంలో విడుదల చేసిన బిల్లులపై అంతర్గత విచారణకు ఆయా జిల్లాల పంచాయతీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మెజార్టీ గ్రామ పంచాయతీల్లో ఈ అవకతవకలు చోటుచేసుకున్నాయి. మొత్తం 203 పంచాయతీల్లో రూ.6.01 కోట్లకు లెక్కలు తేల్చాల్సి ఉంది. ఉదాహరణకు కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీకి ఇన్‌చార్జి ఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అదే మండలం వాకలపూడి గ్రామపంచాయతీకి రెగ్యులర్‌ ఈఓ. రమణయ్యపేట గ్రామ పంచాయతీలో ఇప్పుడున్న ఈఓ కంటే ముందున్న ఈఓ చేసిన పనుల బిల్లులు కూడా తాజాగా విడుదల చేశారంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రమణయ్యపేట, సర్పవరం గ్రామ పంచాయతీలు గ్రేడ్‌–1 పరిధిలో ఉన్నాయి. అటువంటి రమణయ్యపేట గ్రామ పంచాయతీలో రూ.19.45 లక్షలు, సర్పవరం గ్రామ పంచాయతీలో రూ.15లక్షలు నుంచి రూ.20 లక్షలు వంతున డ్రా చేశారని చెబుతున్నారు. ఈ బిల్లులు విడుదలలో అవకతవకలపై అంతర్గత విచారణకు ఆదేశించడంతో గ్రామ పంచాయతీ అధికారుల్లో గుబులురేపుతోంది.

జిల్లా పంచాయతీలు నిధుల విడుదల

కోనసీమ 57 రూ.1.61 కోట్లు

కాకినాడ 61 రూ.1.90 కోట్లు

తూర్పుగోదావరి 85 రూ.2.50 కోట్లు

మొత్తం 203 రూ.6.01 కోట్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement