ఉసురు తీస్తున్న ఊబులు.. | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీస్తున్న ఊబులు..

Jun 28 2026 12:16 AM | Updated on Jun 28 2026 12:16 AM

ధవళేశ్వరం/కపిలేశ్వరపురం: కాటన్‌ బ్యారేజ్‌ అందాలు వీక్షించడం ఓ మధురానుభూతి. ఓ పక్క గోదారి గలగలలు, మరో పక్క గోదారి పాయల నడుమ ఇసుక తిన్నెలు. ఇంకో పక్క పక్షుల కిలకిల రవాలు. భావుకులకు అదో అద్వితీయ దృశ్య కావ్యం. ఆస్వాదన వరకు బాగానే ఉంటుంది కానీ.. ఆ అందాలతో ఆకతాయి ఆటలాడితేనే సమస్య. గత మంగళవారం కాటన్‌ బ్యారేజీ దిగువున ఇసుక తిన్నెల్లో నీళ్లల్లోకి దిగి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. గడిచిన పదేళ్లలో ఇలా సుమారు 70 మంది మునిగిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వారంతా 12 నుంచి 25 ఏళ్ల మధ్య యువకులే కావడం గమనార్హం. ఎన్ని హెచ్చరిక బోర్డులు పెట్టినా నీటిని చూసి పొంగే ఆనందంలో, ఇసుక తిన్నెల్లో ఉన్న దొంగ ఊబులను గమనించక అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు.

ఇసుక గుంతలే మృత్యు కుహరాలు

గోదావరి తీరం వెంబడి అనేక స్నాన ఘట్టాలున్నాయి. కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, తాతపూడి, కపిలేశ్వరపురం గ్రామాల ర్యాంపుల్లో ఇసుక అక్రమ తవ్వకాలతో నదిలో లోతైన గోతులు ఏర్పడి మృత్యు కుహరాలుగా మారుతున్నాయి.

నదిలో కలసిన ప్రాణాలెన్నో

● ఒక్క ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గోదావరి పాయల్లో ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి.

● ఈ నెల 14న మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన జాగ్‌ దయాకర్‌ (18) కె.గంగవరం మండలం కోటిపల్లి రేవులో మృతి చెందాడు.

● ఈ నెల 23న ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు పెద్దిపాటి హేమంత్‌ (21), జస్వంత్‌ కుమార్‌ (18) మృతి చెందారు.

● మే 11న యానాం గౌతమీ గోదావరి పుష్కర ఘాట్‌లో రాజమహేంద్రవరానికి చెందిన షేక్‌ ఫైజన్‌ (17) మృతి చెందాడు.

● 2025 నవంబర్‌ 9న అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన పదో తరగతి విద్యార్థి నామాడి బన్ను (17) కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు ధనమ్మ మర్రి ప్రాంతంలో ఇసుక గుంతల్లో చిక్కుకుని చనిపోయాడు.

ఇసుక తిన్నెల్లో పొంచి ఉన్న ప్రమాదాలు

పదేళ్లలో సుమారు

70 మంది మృత్యువాత

హెచ్చరికలను ఖాతరు

చేయని సందర్శకులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement