● నానా అవస్థలు పడిన భక్తులు
● పార్కింగ్ స్థలంలో బురద చీదర
ఆత్రేయపురం: లక్షల్లో భక్తులు.. రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా, వాడపల్లికీ వాన కష్టాలు తప్పలేదు. వర్షపునీరు ముంచెత్తడం, ఆపై బురద చేరడం భక్తుల సహనాన్ని పరీక్షించింది. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి శనివారం ఉదయం వచ్చిన భక్తులకు వాన విసుగు పుట్టించింది. ఆలయ ఆవరణలో సైతం అడుగు మేర నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. వాహనాల పార్కింగ్ స్థలంలో భారీ వర్షానికి నీరు నిలిచి ఎటు వెళ్లాలో తెలియక తడిసి ముద్దయ్యారు. అలాగే కొందరి పాదరక్షలు, సామగ్రి కొట్టుకుపోయాయి. వాహనాల పార్కింగ్ స్థలంలో వర్షపు నీరు చేరడంతో కాలువను తలపించింది. అక్కడ అంతా బురదగా మారింది. మోకాలు లోతు నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. అలాగే ఆలయంలో భారీ వర్షం పడటంతో దర్శనాలకు నానా అవస్థలు పడ్డారు. ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ఆవరణలో నీటిని బయటకు పంపించడానికి మోటార్లను ఏర్పాటు చేయించి, పనులు చేపట్టారు. అలాగే పార్కింగ్ స్థలంలో ఆయన పర్యటించి, భక్తుల ఇబ్బందులను గమనించారు. అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయడం కూడా కష్టసాధ్యంగా మారింది. ఇదిలా ఉంటే ఆలయం వద్ద వసతుల కల్పన, అభివృద్ధి పనులు నత్తనడకగా సాగుతుండటం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వకుళమాత అన్నదాన భవనం నిర్మాణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. తాత్కాలిక అన్నదాన షెడ్డు భక్తుల భోజనాలకు అనువుగా లేదు. ప్రధానంగా ఇక్కడ అన్నదాన భవనం నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి, భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి. అలాగే శ్రీనివాసమ్ వంటి ఇతర భవన నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేయాలి. పార్కింగ్ స్థలాలలో సైతం మెరక చేసే పనులు నాసిరకంగా ఉండటంతో ఇబ్బంది వస్తోంది. అక్కడ సరిచేయించాల్సి ఉంది.


