సామర్లకోట: పెద్దాపురం జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆర్ట్స్ విభాగం 11వ తరగతిలో ఖాళీ సీట్లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 2026 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలని, ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు జూన్ 1వ తేదీ, 2009 – జూలై 31, 2011 మధ్య జన్మించి ఉండాలన్నారు. విద్యార్థులకు ఉచిత భోజన వసతితో పాటు స్టేషనరీ అందించి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు పదో తరగతి మార్కుల జాబితా జతపరచి స్వయంగా పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 29 వరకు లభిస్తాయని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 30వ తేదీ లోగా నవోదయ పాఠశాలలో సమర్పించాలన్నారు.
నేడే పల్స్ పోలియో
కాకినాడ క్రైం: జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహనాయక్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో నిర్వహించేందుకు 990 బూత్‌లు, 56 ట్రాన్సిట్ పాయింట్లు, 61 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,44,762 మంది 0–5 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేస్తారన్నారు. స్థానిక రామారావుపేట యూపీహెచ్‌సీలో అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. 131 రూట్ సూపర్‌వైజర్ల ద్వారా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తామన్నారు. ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ సిబ్బంది క్షేత్రస్థాయిలో బూత్‌లకు పిల్లల్ని తరలిస్తారన్నారు. తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రామ, పట్టణ స్థాయిల్లో విస్తృత అవగాహన కల్పించామని అన్నారు. అందులో భాగంగా కాకినాడ భానుగుడి కూడలిలో మానవహారం ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
అమరావతి అన్యాయాలను
ప్రశ్నిస్తే దాడులా?
జమ్మలమడక నాగమణి
కాకినాడ రూరల్: అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ అకృత్యాలను గూండాల దాడిగా ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అభివర్ణించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఇటీవల పార్టీ అధినేత జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అందులో భాగంగా నేడు పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు సహా పలువురు ముఖ్య నేతలు అమరావతి పర్యటనకు వెళ్లారని పేర్కొన్నారు. ఉండవల్లిలో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు, వైఎస్సార్ సీపీ బృందంపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడటం హేయనీయమని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌పై బండరాయితో దాడి చేయగా ఆయన తృటిలో తప్పించుకున్నారని, దీంతో ఆ రాయి అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ కు తగిలి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్‌ను వైఎస్సార్ సీపీ నేతలే ఆస్పత్రికి తరలించారని వివరించారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, కురగల్లు తదితర గ్రామాలతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు న్యాయ సహాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ భావించారని తెలిపారు. అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లినవారిపై టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. పోలీసులు ఉన్నది శాంతి భద్రతలను పరిరక్షించానికా, టీడీపీ వారికి ఎస్కార్టులుగా ఉండడానికా అని ఆమె ప్రశ్నంచారు. అమరావతిలో జరుగుతున్న మట్టి దందాలు, కమీషన్లు, కాంట్రాక్టర్ల అవినీతి వ్యవహారాలపై ప్రజలకు వివరిస్తామని నాగమణి తెలిపారు.


