● సత్యదేవుని ఆలయంలో కుర్చీ కోసం
రెవెన్యూ అధికారుల పైరవీలు
● మెట్ట ప్రాంత ప్రజా ప్రతినిధుల
చుట్టూ ప్రదక్షిణలు
అన్నవరం: సత్యదేవుని ఆలయ ఈఓ కుర్చీ కోసం మళ్లీ జోరుగా పైరవీలు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. రానున్న పుష్కరాల నాటికి రెగ్యులర్ ఈఓ నియామకం తప్పని సరి అని భావించి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాడపల్లి వేంకటేశ్వరుని దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు ప్రస్తుతం ఇక్కడ ఇన్‌చార్జి ఈఓగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నెలాఖరు లేదా.. వచ్చే నెలలో..
ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో ఇక్కడ ఈఓను నియమిస్తారన్న సమాచారంతో పలు ఆలయాల అధికారులు మెట్ట ప్రాంత ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం ప్రదక్షిణ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసిన డిప్యూటీ కమిషనర్, ఆయనతో బాటు గతంలో ఇక్కడ డీసీగా పనిచేసిన అధికారి, మరి కొందరు రెవెన్యూ అధికారులతో పాటు ప్రస్తుత ఈఓ కూడా ఇక్కడి ఈఓ పోస్టుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక్కరే ఆర్‌జేసీ.. ఐదు పోస్టులు..
ప్రస్తుతం దేవదాయశాఖలో వి.త్రినాథరావు ఒక్కరే రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా పనిచేస్తున్నారు. గత నెలలో అడిషనల్ కమిషనర్‌గా ఆర్‌జేసీ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ అజాద్‌కు పదోన్నతి కల్పించారు. దీంతో కలిపి ఐదు ఆర్‌జేసీ పోస్టులు ఖాళీ. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అన్నవరంలోని చక్రధరరావును మినహాయిస్తే మిగిలిన ఆరు చోట్లా రెవెన్యూ అధికారులే ఈవోలుగా పనిచేస్తున్నారు.
రెగ్యులర్ ఈఓ తప్పనిసరి
దాదాపు రూ.150 కోట్లు పైబడి వార్షికాదాయం ఉన్న సత్యదేవుని ఆలయానికి రెగ్యులర్ ఈఓ ఉండడం చాలా అవసరం. ఆర్జేసీ హోదా ఉన్నవారే ఇక్కడి ఈఓ పోస్టుకు అర్హులు. ప్రస్తుత ఈఓ చక్రధరరావు అనుభవజ్ఞుడే అయినా ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్జేసీ పోస్టులు ఐదింటిని పదోన్నతి ద్వారా భర్తీ చేస్తే వాటిలో ఆయనకు చాన్స్ వచ్చే అవకాశం ఉంది.


