ఏడిపింఛెన్‌ | - | Sakshi
Sakshi News home page

ఏడిపింఛెన్‌

Jun 27 2026 12:13 AM | Updated on Jun 27 2026 12:13 AM

శనివారం శ్రీ 27 శ్రీ జూన్‌ శ్రీ 2026

కొత్త పింఛన్ల పంపిణీ అంటూ ఆర్భాటం

ఇదిగో ఇచ్చేస్తున్నారంటూ

కూటమి నేతల హడావుడి

సచివాలయాల వద్ద అర్హుల పడిగాపులు

ప్రభుత్వ ఆదేశాలు లేవన్న అధికారులు

ఆశావహులకు తప్పని నిరాశ

పిఠాపురం: నరాల బిగువు, కరాల సత్తువ సన్నగిల్లి, ముదిమి మీద పడి కొందరు.. అవయవాలు సక్రమంగా లేక, ఏ పనీ చేయలేక బతుకు భారంగా ఈడుస్తున్న వారు మరికొందరు.. భర్తను కోల్పోయి, నా అనే దిక్కు లేక దీనావస్థలో ఇంకొందరు.. చంద్రబాబు సర్కారు నిరాదరణతో ఇటువంటి బాధాసర్పదష్టులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి సర్వత్రా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచి అదే మహా గొప్ప అన్నట్టు హడావుడి చేశారు. తీరా చూస్తే ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్యలో కోత పెడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం రెండేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు. ఆ పింఛను వస్తే వృద్ధాప్యంలో, దిక్కులేని దీనావస్థలో ఊపిరి నిలబెట్టుకోవడానికి అవసరమైన మందులు మాకులు కొనుక్కోవడానికి, కడుపు నిండా కాస్త తినడానికి, ఆత్మగౌరవంతో బతకడానికి ఉపయోగపడుతుందని జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన వేలాది మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు చేసుకుని, సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

ఆశ పెట్టి.. ఏడిపిస్తారా?

ఈ తరుణంలో కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 12 నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ కూటమి నేతలు ఇటీవ ల తెగ హడావుడి చేశారు. సోషల్‌ మీడియాలో సైతం ఆర్భాటం చేశారు. పలువురు కూటమి నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి పింఛన్‌ ఆశావహుల నుంచి ధ్రువీకరణ పత్రాలు సైతం సేకరించారు. దీంతో, రెండేళ్లుగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులు గంపెడాశతో సచివాలయాలకు క్యూ కట్టారు. తీరా చూస్తే కొత్త పింఛన్లు ఇవ్వాలంటూ ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఉత్తర్వులూ రాలేదని, అసలు వెబ్‌సైటే ఓపెన్‌ కాలేదని పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, అధికారులు చెప్పడంతో కంగు తినడం ఆ నిర్భాగ్యుల వంతయ్యింది. పింఛన్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ, ఇస్తామని చెప్పి ఇలా ఏడిపించడమేమిటని వారు వాపోతున్నారు.

కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు

పదేపదే తిరిగినా..

కాళ్లు రెండూ చచ్చుబడిపోయి కుటుంబ పోషణ భారంగా మారింది. రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కొత్త పెన్షన్‌ మంజూరు చేస్తున్నారంటూ ప్రచారం చేస్తే ఆశతో సచివాలయానికి వెళ్లాను. అటువంటిదేమీ లేదు పొమ్మన్నారు. ఏ ఆధారమూ లేక కుటుంబం గడవక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించాలి.

– పెనుబోతుల రాంబాబు, దివ్యాంగుడు, జగ్గయ్య చెరువు కాలనీ, పిఠాపురం

అభాగ్యులతో ఆటలా?

దివ్యాంగుడిగా ఉన్న నాకు ఎటువంటి ఆధారమూ లేకపోవడంతో పింఛను మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఈ నెల 12న కొత్త పింఛన్లు ఇస్తున్నారని ప్రచారం జరిగితే గంపెడాశతో వెళ్లాను. ఇప్పుడు అలాంటివేవీ లేవన్నారు. ఇవ్వనప్పుడు ప్రచారం చేయడం ఎందుకు? అభాగ్యులతో ఆటలాడొద్దు. వెంటనే కొత్త పింఛన్లు ఇవ్వాలి.

– లంకా నాగరాజు, దివ్యాంగుడు, పిఠాపురం

జిల్లాలో వివిధ కేటగిరీ

పింఛన్ల పంపిణీ ఇలా..

కేటగిరీ లబ్ధిదారులు

వృద్ధాప్య 1,30,826

దివ్యాంగులు 34,716

ఒంటరి మహిళలు 7,795

వితంతువులు 73,725

మత్స్యకారులు 6,236

కల్లుగీత 3,378

చేనేత 3,411

ఆరోగ్యపరమైనవి 783

మొత్తం 2,71,039

పింఛన్లుగా అందిస్తున్న మొత్తం రూ.116.88 కోట్లు

కొత్త పింఛన్ల కోసం

ఎదురు చూస్తున్న వారు 35,000

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement