భవన నిర్మాణ కార్మికులకు రూ.కోటి విరాళం ఏమైంది? | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణ కార్మికులకు రూ.కోటి విరాళం ఏమైంది?

Jun 27 2026 12:13 AM | Updated on Jun 27 2026 12:13 AM

జూన్‌ 30న చలో విజయవాడకు మద్దతు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికులకు వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం ఇస్తానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కాకినాడలోని పీఆర్‌ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కులను దెబ్బ తీసే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై జూలై 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యాన ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే చర్యలను నిలిపివేయాలని కోరారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేసేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని సుబ్బయ్య స్పష్టం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30న నిర్వహించే ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడు కశింకోట కిషోర్‌ కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొబ్బిలి శ్రీనివాసరావు, సీనియర్‌ కార్మిక నేత కె.ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement