కొత్తపల్లి: తనను వదిలేసి, మరో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి వద్ద ఓ భార్య బైఠాయించిన సంఘటన నాగు లాపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. నాగులాపల్లికి చెందిన చింతపల్లి మురళీరెడ్డికి, రమణక్కపేటకు చెందిన రామశంకరికి 2012లో వివాహమైంది. ఆ సమయంలో మురళీరెడ్డికి రామశంకరి తల్లిదండ్రులు రెండెకరాల భూమి, రూ.2 లక్షల నగదు, 40 కాసుల బంగారం కట్నంగా ఇచ్చా రు. ఆ దంపతులు కొన్నాళ్లు కాకినాడలో కాపురం ఉండేవారు. ఆమెకు పిల్లలు పుట్టడం లేదనే కారణంతో మురళీరెడ్డి గత ఏడాది నవంబరులో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచీ కాకినాడ రాకపోవడంతో రామశంకరి ఆరా తీసింది. ఆమెతో కాపు రం చేయబోనని, తాను మరో వివాహం చేసుకున్నానని అతడు చెప్పాడు. దీనిపై ఇరు వర్గాల మధ్య 8 నెలలుగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులతో కలసి రామశంకరి శుక్రవారం మురళీరెడ్డి ఇంటికి వచ్చింది. తమను బయటకు గెంటేసి, గేటుకు తాళం వేసి, అతడు వెళ్లిపోయాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరో పెళ్లి చేసుకుని తనకు తీవ్ర అన్యాయం చేశాడని, న్యాయం జరిగే వరకూ భర్త ఇంటి వద్ద ఆందోళన చేస్తానని చెప్పింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.


