బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఈ నెల 15 నుంచి జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని 34వ పోలింగ్ కేంద్రం భాస్కర్ నగర్‌లో బీఎల్‌ఓలు ఇంటింటా నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని గురువారం ఆయన అకస్మాత్తుగా పరిశీలించారు. పత్రాల పంపిణీ, వాటిని పూర్తి చేసి, ఓటర్ల తిరిగి స్వీకరిస్తున్న విధానాన్ని నేరుగా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన, శాశ్వతంగా గ్రామం వదిలి వెళ్లిన, నాట్ ట్రేస్ అవుట్ వ్యక్తుల ఓట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. నిర్దిష్ట గడువులోగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఈ విధుల్లో నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సూపర్‌వైజర్లను కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రియ, కాకినాడ ఆర్‌డీఓ మల్లిబాబు కూడా పాల్గొన్నారు.


