మామిడికుదురు: జ్యేష్ఠ శుద్ధ దశమి శుభ ముహూర్తంలో వేద మంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కర్పూర పరిమళ సుగంధ ద్రవ్యాల నడుమ అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి తిరు కల్యాణోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. పాంచరాత్ర ఆగమానుసారం స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి శిష్యులు, యాజ్ఞిక బ్రహ్మ చలమచర్ల వేణుగోపాలాచార్యులు బృందం ఆధ్వర్యాన శ్రీవారి వార్షిక కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బాలబాలాజీ స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సుందరంగా ముస్తాబు చేశారు. బుగ్గన చుక్క పెట్టి, నుదుటన కల్యాణం తిలకం దిద్ది, పెండ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. ఎటువంటి ఆటంకాలూ కలగకుండా కల్యాణోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ విష్వక్సేనారాధన చేశారు. ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి దంపతులు, వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ మొల్లేటి లక్ష్మీనారాయణ 108 కలశాలతో పాటు బ్రహ్మ కలశంలో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమతో స్నపన తిరు మంజన సేవను వైభవోపేతంగా జరిపించారు. సేకరించిన పుట్టమన్నును తొమ్మిది పాత్రల్లో నింపి అంకురార్పణ నయనానందకరంగా జరిపించారు. పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, పరిషదక్షిణ, మృత్సంగ్రహణం, హోమం తదితర కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణోత్సవ కార్యక్రమాలను వీక్షించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తిరు కల్యాణ మహోత్సవ పూజా కైంకర్యాలను వీక్షించి మహదానందం పొందారు.


