జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతి

Jun 24 2026 12:29 AM | Updated on Jun 24 2026 12:29 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ పరిధిలో పని చేస్తున్న పలువురికి మంగళవారం ఉద్యోగోన్నతి కల్పించారు. ఈ మేరకు వారికి జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు నియామక పత్రాలు అందించారు. నలుగురు సీనియర్‌ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా, ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించింది. కారుణ్య నియామకాల ద్వారా ఆరుగురు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మణరావు పాల్గొన్నారు.

ప్రాణం తీసిన స్నానం సరదా

గోదావరిలో మునిగి అన్నదమ్ముల మృతి

ధవళేశ్వరం: సెలవులకు ఇంటికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు గోదావరిలో స్నానానికి దిగి మృతి చెందారు. సరదాగా స్నానం చేయడానికి వచ్చి మృత్యువాత పడ్డారు. ప్రభువా.. నువ్విచ్చిన పిల్లలను నువ్వే తీసుకుపోయావా అంటూ వారి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. ధవళేశ్వరం రాఘవేంద్రస్వామి గుడి సమీపంలో నివసిస్తున్న పెద్దిపాటి శేషుకుమార్‌ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్‌ ఐటీఐలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్‌ కుమార్‌ (21) తాడేపల్లిగూడెంలో హోమియోపతి కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు జశ్వంత్‌ కుమార్‌ (18) రామచంద్రపురంలో బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్నాడు. ఇటీవల సెలవులకు ధవళేశ్వరం వచ్చిన వీరు మంగళవారం సాయంత్రం స్నానం చేసేందుకు కాటన్‌ బ్యారేజీ దిగువన ఉన్న ఇసుక తిన్నెలకు వెళ్లారు. వారితో పాటు సావిత్రీ నగర్‌కు చెందిన స్నేహితుడు మహ్మద్‌ హసన్‌ రాజాకు వెళ్లాడు. ఇసుక తిన్నెల వద్ద స్నానానికి దిగిన వీరు టెన్నిస్‌ బాల్‌తో నీటిలో క్యాచ్‌లు ఆడుతుండగా హేమంత్‌ కుమార్‌ నీటిలో మునిగిపోతుండడంతో, అతడిని కాపాడబోయిన జశ్వంత్‌ కుమార్‌ కూడా గల్లంతయ్యాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితుడు మహ్మద్‌ హసన్‌ రాజా నీటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని వారికి విషయాన్ని చెప్పాడు. సమాచారం తెలిసిన వెంటనే సీఐ టి.గణేష్‌, ఎస్సై హరిబాబు ఘటనా స్థలానికి చేరుకొని హేమంత్‌, జశ్వంత్‌ కోసం నీటిలో మత్స్యకారులతో గాలింపు చేపట్టగా వారి మృతదేహాలు లభించాయి.

వ్యసనాలకు బానిసై చోరీలు

అమలాపురం రూరల్‌: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాక చక్యంగా పట్టుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మోటార్‌ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్‌ జిల్లాల దొంగల ముఠాను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 38 లక్షల విలులైన 38 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ వివరాలను అమలాపురం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా వెల్లడించారు. గత నెల 22న రాత్రి రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఓ ఇంటి బయట పార్క్‌ చేసిన మోటారు సైకిల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై రావులపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు పెదపూడి మండలం రాజుపాలేనికి చెందిన లక్కోజు రాజేష్‌ కుమార్‌, జి.మామిడాడ చెందిన కళ్యాణం నరేష్‌ (బజి), గుండుపల్లి సూర్యతేజ, గండేపల్లి మండలం యర్రంపాలేనికి చెందిన రొట్టె నాగచైతన్య సంతోష్‌కుమార్‌, ఓ బాలుడు కలసి ఈ చోరీలు చేస్తున్నారు. రాజేష్‌కుమార్‌, నాగచైతన్యపై మోటార్‌ సైకిళ్ల చోరీ కేసులు, నరేష్‌పై పోక్సో కేసులు ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement