సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక డి కన్వెన్షన్‌న్‌హాల్లో మంగళవారం వైఎస్సార్ సీపీకి చెందిన బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న, బూత్ కమిటీల ఇన్‌చార్జి చౌదరి తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సమగ్ర సర్వేలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను అధికార పార్టీ తొలగించే అవకాశం ఉంటుందన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటును తొలగిపోకుండా తగిన జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి ఓటరు వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. 2002 ఓటర్ల జాబితాను సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పార్టీ కార్యాలయం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశామని ద్వారంపూడి చెప్పారు. ప్రతి 10 బూత్‌లకు ఒక్కొక్క టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని, ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకుని ఓటర్లలో చైతన్యం కలిగిస్తూ పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ భరోసా కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులు అంగటి అంజి, అడబాల నాగు, వాసంశెట్టి శ్రీనివాస్‌లకు సమావేశంలో సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


