బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జేసీ అపూర్వ భరత్ అన్నారు. ఆ కార్యక్రమం నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,44,762 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు 990 బూతులు, 56 ట్రాన్సిట్ పాయింట్లు, 61 మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని, 131 మంది రూట్ సూపర్ వైజర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. దీనిలో భాగంగా ఈనెల 27న మైక్ ప్రచారం, ర్యాలీలు, పీహెచ్‌సీల పరిధిలో అవగాహన కల్పించాలన్నారు.


