ఊపిరితిత్తుల విభాగం తరలింపుపై స్పష్టతనివ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఊపిరితిత్తుల విభాగం తరలింపుపై స్పష్టతనివ్వాలి

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో భాగంగా స్థానిక వార్ఫ్‌ రోడ్‌లో ఉన్న ఊపిరితిత్తుల విభాగాన్ని ఎక్కడికి తరలిస్తున్నారో స్పష్టతనివ్వాలని సంబంఽధిత స్పెషాలిటీ వైద్యులు డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ఇటీవల కాకినాడకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను కలిసి నివేదించామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో నూతన ఓపీ భవంతి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారని, వార్ఫ్‌ రోడ్‌లో ఉన్న పల్మనాలజీ భవంతి విభాగాన్ని కూడా తొలగించాలని నిర్ణయించారని తెలిపారు. అయితే ఊపిరితిత్తుల విభాగం సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉండాలని నూతనంగా నిర్మిస్తున్న ఓపీ భవంతిలోనే ఈ సేవలను కూడా కొనసాగించనున్నారన్న ప్రచారం సాగుతోందని తెలిపారు. ఇదే నిజమైతే సాధారణ రోగులు, వారి సహాయకులకు మరిన్ని అనారోగ్య పరిస్థితులు తప్పవని అన్నారు. నూతన ఓపీ భవంతిలో నిర్మాణం చేపట్టకపోతే, ఎక్కడ నిర్మిస్తున్నారో సంబంధిత అధికారులు స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు.

చినవెంకన్న హుండీ

ఆదాయం రూ.1.70 కోట్లు

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రమోద కల్యాణ మండపంలో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్‌వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గడచిన 14 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 1,70,53,076 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 147 గ్రాముల బంగారం, 2.510 కిలోల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని పాత రూ. 2 వేలు, రూ. 500 నోట్ల ద్వారా రూ.7,500 వచ్చిందన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.

1న డీసెట్‌

రాజమహేంద్రవరం రూరల్‌: డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డీసెట్‌) 2026ను జూలై ఒకటిన నిర్వహించనున్నట్లు బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్‌) ప్రిన్సిపాల్‌ ఆర్‌జేడీ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీడీఈఈసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ లేదా సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ల నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement