తనకు తల్లిదండ్రులు పసుపు–కుంకుమ మాన్యం కింద ఇచ్చిన భూమిని కాజేసేందుకు కాకినాడ డీసీసీబీ చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఎత్తుగడ వేస్తున్నారని వరుసకు సోదరి అయిన అమలకంటి తులసి కిరణ్మయి వాపోయారు. కాకినాడ జిల్లా ఎర్రవరంలోని సర్వే నంబర్ 234, 253లో ఉన్న సుమారు 94 సెంట్లు భూమిని తన ఆధీనంలో పెట్టుకుని తుమ్మల బాబు వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేశారు. తన భర్త కిడ్నీ పేషెంట్ కావడంతో ఆ భూమి వ్యవహారం తాను చూసుకొంటానని నమ్మించి ప్రస్తుతం భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు తుమ్మల బాబు పేరుతో తయారు చేయించుకొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే పెద్దాపురం మండలం పులిమేరులో ఉన్న తన తండ్రికి చెందిన ఐదు సెంట్ల స్థలాన్ని కూడా తుమ్మల బాబు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు.


