చెదురుతున్న బాల్యం | - | Sakshi
Sakshi News home page

చెదురుతున్న బాల్యం

Jun 22 2026 12:30 AM | Updated on Jun 22 2026 12:30 AM

వదలని జాడ్యం..

ఇలా చేస్తే విముక్తి

● పిల్లలను బిచ్చమెత్తించే వ్యక్తులు, ముఠాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కన్న తల్లిదండ్రులైనా ఉపేక్షించకూడదు.

● పిల్లల భిక్షాటనను నివారించడంలో రక్షణ, పునరావాసం అత్యంత కీలకం. భిక్షాటన చేసే పిల్లల్ని గుర్తించి ఆశ్రయ గృహాలు, విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపాలి. నిర్బంధ విద్య కచ్చితంగా అమలు చేయాలి.

● పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేసి, ఉపాధి అవకాశాలు కల్పించి, పిల్లలను భిక్షాటనకు పంపించే పరిస్థితి నుంచి దూరం చేయాలి.

● స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పిల్లల సంక్షేమం కోసం పని చేయాలి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ప్రత్యేక నిఘా, హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి.

● బాలల భిక్షాటన ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో నిరంతర తనిఖీలు నిర్వహించాలి.

● బాల కార్మికత్వం, అక్రమ రవాణా కూడా బాలల భిక్షాటనకు ప్రధాన కారణాలు, వీటిని నిర్మూలించాలి.

కాకినాడ క్రైం: బడి వయస్సు పిల్లలందరూ బడిలోనే ఉండాలంటూ.. ఏటా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం తెగ హడావుడి చేస్తూంటుంది. కానీ, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ భావిభారత పౌరులైన బాలలు బిచ్చమెత్తుకుంటూనే కనిపిస్తున్నారు. బాలల భిక్షాటన నిర్మూలనకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనివ్వడం లేదనడానికి కాకినాడ నగరంతో పాటు జిల్లాలోని పలు పట్టణాల్లో నిత్యం రోడ్లపై కనిపిస్తున్న బాలలే సాక్ష్యం.

బాలలను గుర్తిస్తున్నా..

మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన బిచ్చమెత్తుతున్న బాలలను గుర్తిస్తున్నారు. గత రెండేళ్లలో 57 మంది బాల భిక్షకులు పట్టుబడ్డారు. 2024లో 13 మంది, 2025లో 32, 2026 మే నెలాఖరు వరకూ 12 మందిని గుర్తించారు. వీరిలో కేవలం నలుగురినే పాఠశాలల్లో చేర్చారు. మిగిలిన 53 మందికి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ పేరుతో ఇలా చేయొద్దు.. పోయి చదువుకోండని నాలుగు మాటలు చెప్పి వదిలేశారు. విచిత్రమేమిటంటే.. ఏడాది, రెండేళ్ల క్రితం పాఠశాలల్లో చేర్చిన ఆ నలుగురు పిల్లలూ ఇప్పుడు స్కూళ్లకు వెళ్తున్నారా లేక మళ్లీ జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టారా అనే విషయంపై అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేదు. వీరు కాకుండా మరో 120 మందికి పైగా పిల్లలు జిల్లాలో భిక్షకులుగా సంచరిస్తున్నారని సమాచారం.

మూడు హాట్‌స్పాట్లు

జిల్లాలో పిల్లల భిక్షాటన జరుగుతున్న మూడు హాట్‌స్పాట్లను అధికారులు గుర్తించారు. సామర్లకోటలో రోడ్డు పక్కన పెట్రోలు బంక్‌, కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లో వద్ద పి.కొత్తూరు, తాళ్లరేవు మండలం పి.మల్లవరం వద్ద హైవే వీటిల్లో ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో సంచార జాతులు, వలస కుటుంబాలు ఎక్కువగా నివాసం ఉంటున్నాయి. వారి పిల్లలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నారని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వారు ఇక్కడ ఉంటున్నారని అధికారులు అంటున్నారు.

ఫ బిచ్చమెత్తుకుంటున్న భావిభారతం

ఫ జిల్లాలో రెండేళ్లలో గుర్తించిన పిల్లలు 57 మంది

ఫ వారిలో బడికి పంపిన వారు నలుగురు

ఫ వారి సమాచారంపై సమాధానం నిల్‌

ఫ గుర్తించని వారు 120 మందికి పైగా ఉంటారని అంచనా

ఫ సత్ఫలితాలనివ్వని నియంత్రణ చర్యలు

ఇవీ కారణాలు

బాల్యం భిక్షాటనలో మగ్గిపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం. అలాగే, పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలు వారిని బలవంతంగా భిక్షాటనలోకి దింపుతున్నాయి. మరోవైపు దానం రూపంలో సునాయాసంగా డబ్బు లభించడం, విద్య, భవితపై అవగాహన లోపం, పునరావాస సమస్యలు, సంచార జాతులు, వలస కుటుంబాల వంటివి పిల్లల భిక్షాటనకు కారణాలవుతున్నాయి. చట్టాల అమలులో లోపం వల్ల కూడా ఈ జాడ్యం వదలడం లేదు. అంతే కాదు.. గుర్తించిన పిల్లల చదువు, పునరావాసం వంటి చర్యలను ప్రభుత్వ యంత్రాంగం పక్కాగా చేపట్టడం లేదు. దీంతో, ఆ పిల్లలు ఆ మరుసటి రోజే జోలె పట్టి మరో ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నారు.

డబ్బులు కాదు.. సమాచారం ఇవ్వాలి

బాలలకు భిక్షాటన నుంచి విముక్తి కల్పించేందుకు ప్రతి వ్యక్తీ తన వంతు బాధ్యతను పోషించాలని అధికారులు కోరుతున్నారు. బిచ్చమెత్తుకుంటున్న బాలలు చేతులు చాచి చిల్లర కోసం అడిగినప్పుడు డబ్బులు కాకుండా 1098కి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. తద్వారా తమ సిబ్బంది వచ్చి, ఆ పిల్లల్ని రెస్క్యూ చేసి, సన్మార్గం వైపు నడిపిస్తారని అంటున్నారు.

అక్షర భిక్ష యాచించాల్సిన చేతులు.. కన్నీటి చారలతో బిచ్చమెత్తుతున్నాయి.. పలకా బలపం పట్టాల్సిన వేళ్లు.. పళ్లెం పట్టుకుని ఆకలి తీర్చాలంటూ అర్థిస్తున్నాయి. అందమైన యూనిఫాం ధరించి బడికెళ్ళాల్సిన బాల్యం.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ.. ఒక పూట తిండి కోసం దేహీ.. అంటూ వీధిన‘బడి’ంది. దానం.. ధర్మం అంటూ జోలె పడుతోంది. పుట్టుకతోనే శాపగ్రస్తమై, వెనుకబాటుతనపు చీకట్లో మగ్గిపోతున్న బాల్యంపై.. వెలుగులు ప్రసరింపజేయడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం నిత్యం వెక్కిరిస్తూనే కనిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement