● ప్రైవేట్ విదాసంస్థల్లో భారీ దోపిడీ
● నియంత్రణలో విద్యాశాఖ విఫలం
● తల్లిదండ్రుల కన్నీటీతో విద్యా వ్యాపారం
● ఖాతాలకు జమకాని తల్లికి వందనం
ఆలమూరు: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల కార్పొరేట్, ప్రైవేటు విద్య మాఫియాగా తయారైంది. సగటు జీవి చదువును కొనలేని స్థితి ఏర్పడింది. నిబంధనల ఉల్లంఘన, ఫీజుల దోపిడీ, బలవంతపు స్టేషనరీ కొనుగోళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. పాఠశాల ఫీజులు, బస్ ఫీజులను ప్రైవేటు యాజమాన్యాలు బాగా పెంచేశాయి. ఫీజుల నియంత్రణ కమిటీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ దోపిడీని నియంత్రించడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైంది.
జిల్లాలోని 19 మండలాల్లో 2,275 పాఠశాలలు ఉండగా 1.93 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 1551 ప్రభుత్వ పాఠశాలల్లో 87 వేల మంది 724 ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 1.96 లక్షల మంది ఉన్నారు. వారందరికీ విద్యా సంవత్సరం ప్రారంభించిన రోజే తల్లికి వందనం సొమ్ము పడాల్సి ఉంది. అయితే ఆ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
అ‘ధన’పు తరగతులు
కూటమి నేతల ప్రొద్బలంతో అధికార పార్టీ సానుభూతి పరుగులుగా ప్రసిద్ధిగాంచిన కొంతమంది ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు జిల్లాలో అనేక చోట్ల అనుమతులు లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నారు. వాటిపై జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలమూరు మండలంలోని చెముడులంకలోని నేతాజీ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో వారం రోజుల క్రితం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారంటూ కేసును నమోదు చేసి షోకాజ్ నోటీసు జారీ చేసినా ఇంకా స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలకు సంబంధించిన విద్యాసంస్థలే అధికంగా ఉండటంతో ఈ దోపిడీ పేట్రేగి పోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
విద్యాసంస్థల దోపిడి పర్వం ఇలా
● ప్రైవేట్ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా యేటా ట్యూషన్ ఫీజులను 30 శాతం నుంచి 50 శాతం వరకూ పెంచుతున్నారు.
● విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే సీట్ల కేటాయింపు పేరిట భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు.
● ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ తరగతులు, ప్రత్యేక ఫీజుల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
● బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే పాఠ్య, నోట్ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం విద్యాసంస్థల్లోనే అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
పాటించాల్సిన నిబంధనలివీ
● ప్రైవేట్ విద్యాసంస్థలన్ని ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని (2009) కచ్చితంగా అమలు చేయాలి.
● ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే స్టార్ ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయించిన ఫీజుకు అదనంగా ఒక రూపాయి కూడా వసూలు చేయరాదు.
● ప్రైవేట్ విద్యాసంస్థల్లో తప్పనిసరిగా విద్యాశాఖ సహకారంతో తల్లిదండ్రుల కమిటీ ఏర్పాటు చేయాలి.
● విద్యాసంస్థలన్నింటి వద్ద ఫీజుల వసూలు వివరాలతో కూడిన నోటీసు బోర్డులను ప్రదర్శించాలి.
● పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాం ఇతర స్టేషనరీని సంబంధిత విద్యాసంస్థల్లో విక్రయించరాదు.
● విద్యాసంస్థలోనే కొనుగోలు చేయాలని లేదా సంబంధిత దుకాణం వద్దే కొనాలని బలవంతం చేయరాదు.
● ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు అమలు చేసి విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలి.
● ఫీజుల బకాయి పేరుతో విద్యార్థుల టీసీలను ఎట్టి పరిస్థితుల్లోను ఆపకూడదు.
యాజమాన్యం ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలలు 1237 85 229 86.000
ప్రైవేట్ పాఠశాలలు 125 167 432 1.07.00
తల్లిదండ్రుల కమిటీకి తిలోదకాలు
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థలో తప్పనిసరిగా తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయాలి. తరగతి గదులు, తాగునీటి వసతి, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలను వారు పరిశీలించాలి. యాజమాన్యంతో తల్లిదండ్రుల కమిటీ చర్చించి ఫీజులను నిర్థారించి దానికి అనుగుణంగా తీర్మానాలు చేసి ఉన్నతాధికారుల ఆమోదం పొందాలి. వాటిని ప్రైవేటు పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అటువంటివేవీ కనపడవు. కారణం వాటికి విద్యాశాఖ దాసోహం కావడమే. ప్రైవేటు పాఠశాలలు ఇంతగా దోచుకుంటున్నా వాటిలోనే విద్యార్థుల చేరికలు అత్యధికంగా ఉంటున్నాయంటే ప్రభుత్వ విద్యపై ప్రజల్లో ఎంత ప్రతికూలత ఉందో అర్ధమవుతోంది.
ఫీజుల మోత–ధరల వాత
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా లభించే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, నిఘంటువులు, యూనిఫాం తదితర వస్తువులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ఎల్‌కెజీ విద్యార్థికి ఏడాదికి పుస్తకాలు, బస్సు ఫీజు, ఏకరూప దుస్తులు, టై, సాక్సులు, బ్యాగుల కొనుగోలుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇదే క్రమంలో పదో తరగతి విద్యార్థికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ అవుతుంది. విద్యార్థుల సౌకర్యాలు, ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ చేపట్టాల్సిన తనిఖీలు భూతద్దం వేసి చూసినా కనిపించడం లేదు. మార్కెట్‌లో ఉన్న పాఠ్య పుస్తకాల ధరలకు ప్రైవేట్ విద్యాసంస్థల కొనుగోలు చేసే పుస్తకాల ధరలకు భారీ వ్యత్యాసం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించాలి
సామాన్య, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలి. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో తప్పనిసరిగా ఫీజుల బోర్డులు ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– జి.రవికుమార్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కోశాఽధికారి, ఆలమూరు


