90.02 శాతం హాజరు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 3,232 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,922 హాజరయ్యారు. ప్రశ్నపత్రం లీకవడంతో గత మే నెలలో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకూ ఈ పరీక్షమరోసారి నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ మున్సిపల్ స్కూల్, జేఎన్‌టీయూకేలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని అన్నారు. మొత్తం 90.02 శాతం విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.
లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానానికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 32 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,61,690, పూజా టికెట్లకు రూ.4,65,646, కేశఖండన శాలకు రూ.20,880, వాహన పూజలకు రూ.7,416, కాటేజీలు. పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.98,430, విరాళాలు రూ.10,602 కలిపి మొత్తం రూ.8,89,014 ఆదాయం లభించిందని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు.
ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై నేతల ఆరా
గోకవరం: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం కుమారుడు, ఆ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి గిరిబాబును పరామర్శించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా గిరిబాబును పరామర్శించారు. ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫోన్ ద్వారా గిరిబాబును అడిగి తెలుసుకున్నారు.
స్వగ్రామంలో ‘పెద్ది’ దర్శకుడి సందడి
కొత్తపల్లి: ఉప్పెన, పెద్ది చిత్రాల దర్శకుడు సానా బుచ్చిబాబు ఆదివారం స్వగ్రామం కొత్తపల్లి వచ్చారు. తన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కేక్ కట్ చేసి, పెద్ది సినిమా విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు విషయాలపై ఆయన ముచ్చటించారు. పెద్ది సినిమా తన జీవితంలో మరపురాని విజయాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని మంచి చిత్రాలకు దర్శకత్వం వహించడానికి ప్రేరణ కలిగించిందన్నారు. త్వరలో మరో మంచి చిత్రానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.
నేడు ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డీఎస్సీ 1998, 2008 జీఎస్‌టీ (ఎమ్‌టీఎస్) ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారందరికీ ఈ నెల 22న కాకినాడలోని సమగ్ర శిక్షా హాలులో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్ల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ ఆదివారం తెలిపారు. డీఈవో.ఈజీ.ఆర్గ్‌లో పొందుపర్చిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు.


