గోవింద.. హరి గోవింద | - | Sakshi
Sakshi News home page

గోవింద.. హరి గోవింద

Jun 21 2026 12:55 AM | Updated on Jun 21 2026 12:55 AM

వెంకన్న నామస్మరణతో

మార్మోగిన వాడపల్లి క్షేత్రం

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

ఆత్రేయపురం: గోవింద.. హరి గోవింద నామస్మరణ మార్మోగింది. శనివారం కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. కాలినడకన సైతం అనేక మంది ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద ఎటు చూసినా జనమే కనిపించింది. స్వామివారికి వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న క్షేత్రపాలకులు, అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ, నీరు అందించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఒక్కరోజు సుమారు లక్ష మంది ఆలయాన్ని దర్శించుకున్నారని ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. స్వామివారిని కొత్తపేట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాట్లను ఈఓతో పాటు ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు. ఈ ఒక్కరోజే ఆలయానికి రూ.61,16,327 సమకూరింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement