రోడ్డున పడేస్తారా? | - | Sakshi
Sakshi News home page

రోడ్డున పడేస్తారా?

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

వార్ఫు రోడ్డులో ఫుడ్‌హబ్‌

ఏర్పాటుకు సన్నాహాలు

అక్కడే చిరు వ్యాపారాలతో

జీవిస్తున్న 120 కుటుంబాలు

వారి దుకాణాలను తొలగిస్తున్న అధికారులు

జీవనోపాధి కోల్పోతున్న బాధితులు

న్యాయం చేయాలని డిమాండ్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా రోడ్ల పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ పలువురు జీవనం సాగిస్తున్నారు. వారు ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న దుకాణాలను ఫుడ్‌హబ్‌ ఏర్పాటు చేస్తామనే పేరుతో అధికారులు తొలగిస్తున్నారు. దీంతో, తాము బతుకుతెరువు కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తోందని ఆ చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ సంగతి..

కాకినాడ 30వ డివిజన్‌ వార్ఫు రోడ్డులో సుమారు 100 నుంచి 120కి పైగా కుటుంబాల వారు చాలా సంవత్సరాలుగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. పశువులు మేపుకొని పాలు, టిఫిన్లు, టీలు విక్రయించుకుంటూ కొందరు, పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేస్తూ మరికొందరు జీవనం సాగిస్తున్నారు. పాత సామాన్ల విక్రయాల వంటి సుమారు 80కి పైగా షాపులు ఇక్కడున్నాయి. కొందరు పదేళ్లు, మరికొందరు 20 ఏళ్లుగా రోడ్డు పక్కనే బతుకుబండి లాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.4 కోట్లతో మంజూరు చేసిన మోడల్‌ స్ట్రీట్‌ ఫుడ్‌హబ్‌ను నగర పాలక సంస్థ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధులతో ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సుమారు కిలోమీటరు పొడవునా రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణాలను గత రెండు రోజులుగా తొలగిస్తున్నారు. ఇక్కడ చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న చిన్న పాకలతో పాటు దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో, తాము రోడ్డున పడ్డామని, అర్ధాంతరంగా తమ బతుకుతెరువు కూల్చేయడంతో ఏవిధంగా జీవించాలో అర్థం కావడం లేదని బాధిత కుటుంబాల వారు ఆవేదన చెందుతున్నారు. అభివృద్ధికి తాము అడ్డు కాదని, ఎప్పటి నుంచో ఉన్న జీవనాధారాన్ని తొలగిస్తే రెండు పూటలా ఏం తిని బతకాలని కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు పునరావాసం కల్పించాలని, లేదా వేరే ప్రాంతంలోనైనా జీవనోపాధి పొందేందుకు అవకాశం ఇవ్వాలని, కనీసం ఇక్కడ ఏర్పాటు చేసే ఫుడ్‌పార్కులోనైనా ఏదో ఒక వ్యాపారం చేసుకునేందుకు అనుమంతించి న్యాయం చేయాలని కోరుతున్నారు. కుటుంబ పోషణ కోసం చిన్న వ్యాపారాలు చేసుకునే తమను రోడ్డు మీద పడేసి పెద్ద వ్యాపారులకు ఇక్కడ అవకాశం కల్పించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యామ్నాయం చూపాలి

ఎన్నో సంవత్సరాలుగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వీరిని హఠాత్తుగా ఖాళీ చేయించడం దారుణం. వీరి కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. కనీసం కొన్ని రోజులు సమయం ఇవ్వాలి. వీరికి ప్రత్యామ్నయంగా వేరే ప్రాంతంలో వసతి కల్పించాలి.

– రాగిరెడ్డి అరుణ్‌ కుమార్‌, మాజీ కార్పొరేటర్‌,

వైఎస్పార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు

కుటుంబాన్ని ఎలా పోషించాలి?

పదేళ్లుగా రోడ్డు పక్కన చిన్న వ్యాపా రం చేసుకుంటూ బతుకుతున్నాం. కార్పొరేషన్‌ అధికారులు వచ్చి మా షాపును పూర్తిగా తొలగించేశారు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు.

– కొయ్యా గోవిందమ్మ, వార్ఫు రోడ్డు

చాలా దారుణం

ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం. అటువంటిది ఇప్పుడు ఫుడ్‌హబ్‌ పేరు తో మా పొట్ట కొట్టడం ఈ ప్రభుత్వానికి తగదు. జీవనాధారం కోల్పోతే చాలా ఇబ్బందులు పడతాం. ఫుడ్‌హబ్‌లో మాకు ఏదైనా చిన్న షాపు ఏ ర్పాటు చేస్తే కుటుంబం షోషించుకునే వీలుంటుంది.

– కె.సత్య, వార్ఫు రోడ్డు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement