మోగిన పెళ్లిబాజా | - | Sakshi
Sakshi News home page

మోగిన పెళ్లిబాజా

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

మోగిన పెళ్లి బాజా

నెల రోజుల తర్వాత రత్నగిరిపై తిరిగి సందడి

నవ దంపతులతో కళకళలాడుతున్న

సత్యదేవుని ఆలయం

అన్నవరం: మూడు ముళ్ల బంధానికి లగ్గం కుదిరింది.. ఏడడుగులతో సాగే పయనానికి మంచి గడియ రానే వచ్చింది.. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో పెళ్లి బాజాలు తిరిగి మోగుతున్నాయి. అధిక జ్యేష్ట మాసం కారణంగా నెల రోజులు పెళ్లిళ్లకు బ్రేక్‌ పడింది. అది కాస్తా ముగిసి, నిజ జ్యేష్ట మాసం ప్రారంభం కావడంతో రత్నగిరిపై నవ దంపతుల సందడి మొదలైంది. ఈ మాసంలో సుమారు 600 వివాహాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏటా చైత్ర మాసం నుంచి అంటే మార్చి – ఏప్రిల్‌ నుంచి జ్యేష్ట మాసం అంటే జూలై వరకూ వివాహాలు జరుగుతాయి. ఈ ఏడాది చైత్ర, వైశాఖ మాసాల్లో అంటే మార్చి 9 నుంచి మే 11వ తేదీ వరకూ వివాహాలు జరిగాయి. ఆ తరువాత అధిక జ్యేష్ట మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదన్న పండితుల సూచనలతో మే 17 నుంచి జూన్‌ 15 వరకూ వివాహాది శుభకార్యాలేవీ జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ట మాసం ప్రారంభమైంది. దీంతో, శుక్రవారం నుంచి వివాహ శుభకార్యాలు ప్రారంభమయ్యాయి.

పెళ్లిళ్లన్నీ కల్యాణ మండపాల్లోనే..

● అన్నవరం దేవస్థానంలో ఏటా చైత్ర మాసం నుంచి జ్యేష్టం వరకూ ఆలయ ప్రాంగణంతో పాటు కల్యాణ మండపాల్లో వివాహాలు జరుగుతాయి. అయితే, వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈసారి వివాహాలన్నీ కల్యాణ మండపాలు, విశ్రాంతి షెడ్లలోనే జరుగనున్నాయి.

● సత్యగిరిపై దాత, పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ మట్టే శ్రీనివాస్‌ దంపతులు నిర్మించిన శ్రీ సత్య శ్రీనివాసా కల్యాణ మండపంలో 12 చిన్న వివాహ మండపాలున్నాయి. అలాగే, విశాఖపట్నానికి చెందిన పారిశ్రామికవేత్త ఎంఎస్‌ రెడ్డి నిర్మించిన శ్రీ ఎంఎస్‌ రెడ్డి అంజనీ వివాహ వేదికలో కూడా 12 చిన్న కల్యాణ మండపాలున్నాయి. ఈ రెండు చోట్ల ఆయా ముహూర్తాల్లో 24 వివాహాలు జరగనున్నాయి. ఈ మండపాలను పెళ్లి బృందాలు ఇప్పటికే రిజర్వ్‌ చేసుకున్నాయి.

● దేవస్థానంలో సత్యగిరిపై విష్ణు సదన్‌ సత్రంలోని 36 మ్యారేజ్‌ హాళ్లలో కూడా ఆయా ముహూర్తాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వీటితో పాటు రత్నగిరి రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో కూడా వివాహాలు జరుగుతున్నాయి.

● అన్నవరంలోని సుమారు 20 లాడ్జీల్లోని కల్యాణ మండపాల్లో కూడా వివాహాలు జరగనున్నాయి.

సందడే సందడి..

పెళ్లిళ్ల సందడి మొదలు కావడంతో క్యాటరింగ్‌, సన్నాయి మేళం, పురోహితులకు డిమాండ్‌ ఏర్పడింది. వివాహ ముహూర్తాలతో సత్యదేవుని ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరగనుంది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధువులు కూడా సత్యదేవుని ఆలయానికి తరలి రానున్నారు.

ఆషాఢంలో మళ్లీ విరామం

ఆషాఢ మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ వివాహాది శుభ కార్యాలకు మళ్లీ బ్రేక్‌ పడనుంది. తిరిగి శ్రావణ మాసం అంటే ఆగస్టు 15 నుంచి మళ్లీ పెళ్లి బాజాలు మోగుతాయి.

వచ్చే నెల 9 వరకూ..

శుక్ర, శనివారాల్లో వివాహ ముహూర్తాలున్నాయి.

వీటితో పాటు ఈ నెల 21, 22, 24, 25, 26, 27, జూలై 1 తేదీ నుంచి 9వ తేదీ వరకూ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement