ఏం ఉద్ధరించారని విజయోత్సవాలు? | - | Sakshi
Sakshi News home page

ఏం ఉద్ధరించారని విజయోత్సవాలు?

Jun 20 2026 10:44 AM | Updated on Jun 20 2026 10:44 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి జిల్లా లో విజయోత్సవ సభలు నిర్వహిస్తు న్నారని, ఈ రెండేళ్లలో ప్రజలను ఏం ఉద్ధరించారని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారో బహిరంగంగా చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు ప్రశ్నించారు. సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పెన్షన్లు, జీతాలు ఇవ్వడం ప్రతి ప్రభుత్వమూ చేస్తుంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు ఓ ప్రాజెక్టు పూర్తి చేశారా? ఒక్క ప్రభుత్వ కళాశాలయినా నిర్మించారా? ఒక్క ప్రభుత్వ సంస్థనైనా నిర్మించారా? విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించారా? కడప స్టీల్‌ ఫ్యాక్టరీ తీసుకొచ్చారా? సాగునీటి ప్రాజెక్టులు కట్టారా? నిరంతరం పని చేసే కార్మికుల జీతాలు రూపాయి అయినా పెంచారా? ప్రైవేట్‌ విద్యా సంస్థలు అధిక ఫీజులతో తల్లిదండ్రులను దోచుకుంటూంటే అరికట్టరా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక పాలనే సాగుతోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దుయ్యబట్టారు. బీచ్‌లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి, యువతను పక్కదోవ పట్టించడమే అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. ‘మీరే బార్లు పెడతారు. తాగి రోడ్ల మీద తిరిగితే మళ్లీ మీరే కేసులు పెడతారు. తాగమనేది మీరే.. మా దగ్గర డబ్బులు దోచుకునేదీ మీరే. ఇదెక్కడి అన్యాయం?’ అని ఆయన నిలదీశారు.

రైతు సమస్యలపై

30న చలో విజయవాడ

రాష్ట్రంలోని రైతులు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మధు అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర లేక సిండికేట్‌ మార్కెట్‌ మాయాజాలంలో రైతులు విలవిలలాడుతున్నారని చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క కౌలు రైతుకూ ఏ బ్యాంకూ వ్యవసాయ, ఉద్యాన పథకాలు ఇవ్వడం లేదని విమర్శించారు. గత ఎన్నికల ముందు డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేస్తామంటూ మోదీ చెప్పారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మన రాష్ట్రంలో కూడా రూ.2 లక్షల వరకూ పంట రుణాలు మాఫీ చేసి, రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడాలని, పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల పెరిగిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, పెట్రోలు, డీజిల్‌, వ్యవసాయ యంత్ర పరికరాల ధరలను వెంటనే తగ్గించాలని, ఆక్వా రైతులకు రొయ్యల ఫీడ్‌, సీడ్‌, మందుల ధరలను తగ్గించాలని, జోన్‌, నాన్‌ జోన్‌ పరిమితులు లేకుండా ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తును 50 పైసలకే అందించాలని, రొయ్యలకు మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పాలకుల కళ్లు తెరిపించడానికి, హక్కుల సాధనకు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఈ నెల 30న నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, కౌలు రైతులు తరలి రావాలని కోరారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ పాల్గొన్నారు.

ఫ ఈ రెండేళ్లలో ఏమి సాధించారని

విజయోత్సవ సభలు

ఫ ఎక్కడ చూసినా అరాచకమే..

ఫ కూటమి పాలనపై

సీపీఐ నేత మధు విమర్శ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement