కాకినాడ క్రైం: జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా మహంతి కిషోర్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ బిందుమాధవ్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. కాకినాడ ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) డీఎస్పీ వీజీ శ్రీహరి, స్పెషల్ బ్రాంచి డీఎఎస్పీ కేవీవీ సత్యనారాయణ, పరిపాలనాధికారి ఎంవీవీ సత్యనారాయణమూర్తి తదితరులు అదనపు ఎస్పీని కలిసి, అభినందనలు తెలిపారు.
టెన్త్ సప్లిమెంటరీలో
97.94 శాతం ఉత్తీర్ణత
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 4,043 మంది హాజరవగా 3,951 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,290 హాజరు కాగా 2,248 మంది, బాలికలు 1,744 మందికి 1,703 మంది ఉత్తీర్ణులయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. కాగా, ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు 1,292 హాజరవగా, 1,068 మంది.. ఇంటర్మీడియెట్ పరీక్షలు 3,087 మంది రాయగా 2,773 మంది ఉత్తీర్ణత సాధించారు.
కూటమి ప్రభుత్వానికి
బీసీలంటే చిన్నచూపు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ యాదవ, బీసీ సంఘాల ఆధ్వర్యాన శుక్రవారం జ్యోతిరావు ఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ, రెడ్‌బుక్ రాజ్యంగంలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులకు అణగదొక్కుతున్నారని, ప్రశ్నించే బీసీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ఇటువంటి అక్రమ అరెస్టులకు కేరాఫ్‌గా నిలుస్తోందని దుయ్యబట్టారు.
రేపు అంతర్జాతీయ
యోగా దినోత్సవం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీరు తదితర ఏర్పాట్లను పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తొమ్మిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు
రావులపాలెం: ఈతకోట టోల్‌ప్లాజా వద్ద హైవేపై శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో 9 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.9 వేల అపరాధ రుసుం విధించినట్టు డీటీఓ డి.శ్రీనివాసరావు తెలిపారు. రవాణా శాఖ అధికారులు మొత్తం 22 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించారన్నారు.


