ప్రత్తిపాడు: మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఏజెంట్ల వేధింపుల నుంచి తమను కాపాడాలని లంపకలోవ గ్రామానికి చెందిన దశిత మహిళలు ప్రత్తిపాడులో శుక్రవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రుణాలిప్పిస్తామంటే గ్రామానికి చెందిన రాజాల ఏసురత్నంకు ఆధార్ కార్డుల నకళ్ళు ఇచ్చామని పులగపూరి మరియమ్మ, బొడ్డు సూర్యకళ, మాసా నాగలక్ష్మి, చిన్నం అప్పలరాజు, బొర్రా అర్జమ్మ తదితరులు తెలిపారు. ఏసురత్నం ఇటీవల మృతి చెందడంతో కిర్లంపూడి బంధన్ బ్యాంకు, ప్రత్తిపాడు స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్, ఏలేశ్వరం యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముథూట్ మైక్రోఫిన్ కంపెనీల ఏజెంట్లు తమ ఇళ్లకు వచ్చి, తాము రుణాలు తీసుకున్నామని, తిరిగి చెల్లించకపోతే అరెస్టు చేయిస్తామంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేధింపుల నుంచి తమకు విముక్తి కలిగించాలని కోరారు.


