పిఠాపురం ప్రభుత్వం డిగ్రీ కళాశాల
జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 7
విద్యార్థులు 6,500
కంప్యూటర్ కోర్సులు
చదువుతున్న వారు 1,200
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో
గురువుల కరువు
● కోర్సులు ప్రారంభించిన పోస్టులు
మంజూరు చేయని సర్కారు
● సరైన బోధన లేక విద్యార్థుల అవస్థలు
పిఠాపురం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది ప్రభుత్వ విద్యా విధానం. ఉన్నత విద్యలో ఆర్భాటంగా కొత్త కోర్సులు ప్రారంభించేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగినట్టుగా బోధన సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. తాళము వేసితిని.. గొళ్లెము మరచితిని అన్న చందంగా అధ్యాపక పోస్టుల మంజూరులో మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా బోధించే గురువులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా కాకినాడ, పిఠాపురం, పెరుమాళ్లపురం, తుని, ఏలేశ్వరం, జగ్గంపేట, పెద్దాపురాల్లో ఏడు డిగ్రీ కళాశాలలున్నాయి. వీటితో పాటు పెద్దాపురం ఎంఆర్, కాకినాడలో ఎంఎసెన్ చారిటీస్ ఎయిడెడ్ కళాశాలలు కూడా ఉన్నాయి. వీటిల్లో సుమారు 7 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఈ కళాశాలల్లో బీఏ ఆనర్స్ ఎకనామిక్స్, బీకాం ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఆనర్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఆనర్స్ జువాలజీ తదితర గ్రూపులు నిర్వహిస్తున్నారు. అయితే, చాలా కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా అధ్యాపకులు లేరు. మామూలు కోర్సులకే అరకొరగా అధ్యాపకులు ఉండగా.. కంప్యూటర్ కోర్సులకు చాలా కళాశాలల్లో అసలు అధ్యాపకులే లేని దుస్థితి నెలకొంది. దీంతో, సరైన బోధన లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
కోర్సులున్నా పోస్టులు సున్నా
● డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సులు ప్రారంభిస్తున్న ప్రభుత్వం వాటిని బోధించే అధ్యాపక పోస్టులు మాత్రం మంజూరు చేయడం లేదు.
● పిఠాపురం డిగ్రీ కళాశాలలో బీకాం ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ముగ్గురు అధ్యాపకులుండాలి. కానీ, ఒక్కరు కూడా లేరు. అసలు ఈ కోర్సులకు అధ్యాపక పోస్టులు మంజూరు చేయకపోవడం విచిత్రం. గత్యంతరం లేక ఫ్యాకల్టీలతో బోధించాల్సిన దుస్థితి నెలకొంది. పోస్టులు మంజూరు చేస్తే తప్ప ఇక్కడ అధ్యాపకుల నియామకం సాధ్యం కాదు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే కళాశాలలో బీఎస్సీలో ప్రతి మేజర్ కోర్సుకు కనీసం మూడు పోస్టులుండాలి. కానీ, ఒక్క పోస్టు మాత్రమే ఉంది. బీఏలో ప్రతి మేజర్ కోర్సుకు రెండు పోస్టులకు గాను ఒక్కటి మాత్రమే ఉంది.
● ఏలేశ్వరం, జగ్గంపేటల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులకు 9 పోస్టులు ఉండాలి. కానీ, ప్రభుత్వం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. బీఎస్సీలో 6, బీఏలో 3 చొప్పున పోస్టులు మంజూరు కావాల్సి ఉంది.
● ఇక స్వీపర్లు, స్కావెంజర్లు, వాచ్‌మెన్ వంటి నాన్ టీచింగ్ సిబ్బంది ఒక్కో కళాశాలకు కనీసం ఆరుగురు అవసరం. వారిని నియమించకపోవడంతో ఆయా కళాశాలల్లో విద్యార్థులే ఈ పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
బోధించే వారు లేకపోతే నేర్చుకునేదెలా?
ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విద్యా విధానాలున్నాయి. కంప్యూటర్ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో అధ్యాపకులు లేకపోవడం సిగ్గుచేటు. మామూలు కోర్సులైతే పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు బోధించే వారు కూడా లేకపోతే విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు? పరీక్షలు ఎలా రాయగలుగుతారు? కాలేజీల్లో కోర్సులు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. వాటికి సంబంధించిన పోస్టులు మంజూరు చేయకపోతే చదువెలా సాగుతుంది? కాలేజీల్లో నాన్ టీచింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో విద్యార్థులే ఇతర పనులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే తగినన్ని పోస్టులు మంజూరు చేయకపోతే ఉద్యమించక తప్పదు.
– ఎం గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి, కాకినాడ
ప్రభుత్వానికి నివేదించాం
నూతన కళాశాల భవనం అందుబాటులోకి వచ్చాక పూర్తి స్థాయిలో క్లాసులు ప్రారంభించాం. కళాశాలలో కంప్యూటర్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు సుమారు 130 మంది ఉన్నారు. ఈ కోర్సుకు అధ్యాపకులు లేక ఫ్యాకల్టీల ద్వారా బోధన చేయిస్తున్నాం. ఇతర కోర్సుల్లోనూ అధ్యాపకుల కొరత ఉంది. అధ్యాపకులను నియమించాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే పోస్టులు మంజూరు చేస్తారని భావిస్తున్నాం. నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరూ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది.
– డాక్టర్ పి.సుభాషిణి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పిఠాపురం


