బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై కలేక్టరేట్‌లో గురువారం జరిగిన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇటుక బట్టీలు, క్వారీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. రైల్వే స్టేషన్లు, ప్రధాన దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తున్న బాలబాలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. గత ఏడాది 14 ఏళ్ల లోపు 9 మంది బాల కార్మికులను, 34 మంది కౌమారదశ కార్మికులను గుర్తించామని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకూ నలుగురు బాల కార్మికులను, ఐదుగురు కౌమారదశ కార్మికులను గుర్తించి, పునరావాసం కల్పించామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎన్.బుల్లిరాణి, విద్య, పోలీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ
ఫలితాల విడుదల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఫస్టియర్ పరీక్షలకు 2,131 మంది విద్యార్థులు హాజరవగా 1,015 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ 60 శాతం ఒకేషనల్ 76 శాతం ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా శాఖ అధికారి వి.కేశవరావు తెలిపారు.
ద్వారకా తిరుమల..
అ‘ద్వితీయం’
ద్వారకా తిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకా తిరుమల దేవస్థానానికి రెండో ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా దర్శనం, తాగునీటి వసతులు, ప్రసాదం రుచి, పారిశుధ్యం అంశాలపై ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఇందులో గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించిన ద్వారకా తిరుమల దేవస్థానం, జూన్ నెలకు సంబంధించి ఈ నెల 16న వెలువడిన సర్వేలో ఓ మెట్టు దిగి, ద్వితీయ స్థానంలో నిలిచింది. దర్శనం, సౌకర్యాల కల్పన, ఇతర అంశాల్లో శ్రీకాళహస్తి 1, ద్వారకా తిరుమల 2, 3, సింహాచలం 4, 5, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం 6, శ్రీశైలం 7 (చివరి) స్థానాలు సాధించాయి.


