గ్యాస్‌లో రాష్ట్రానికి 50 శాతం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌లో రాష్ట్రానికి 50 శాతం ఇవ్వాలి

Jun 19 2026 12:30 AM | Updated on Jun 19 2026 12:30 AM

మామిడికుదురు: రూ.లక్షల కోట్లు కార్పొరేట్‌కు, నిద్ర లేని రాత్రులు కోనసీమ ప్రజలకు అన్నట్లు పరిస్థితి తయారైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక కన్వీనర్‌ యరసూరి మహదేవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా – గోదావరి బేసిన్‌ సహజ వాయువు – సహజ వనరుల పరిరక్షణ ఐక్య వేదిక పేరిట వారు నగరం గ్రామంలో గురువారం పర్యటించారు. ఓఎన్‌జీసీ గ్యాస్‌ కలెక్షన్‌ స్టేషన్‌ (జీసీఎస్‌) గేటు ఎదుట ధర్నా చేశారు. నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని, గ్రామానికి 8 శాతం రాయల్టీ ఇవ్వాలని, పీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, నాటి పాశర్లపూడి బ్లో అవుట్‌, నగరం విస్ఫోటం, ఇరుసుమండ గ్యాస్‌ ప్రమాదం వంటి సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ ప్రాంత, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా తాము పోరాటం చేస్తున్నామన్నారు. గ్యాస్‌ వల్ల వస్తున్న సంపదలో 50 శాతం మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఇటువంటి సహజ వనరులు ప్రభుత్వాల చేతుల్లో ఉండాలని, కార్పొరేట్‌ సంస్థల కబంధ హస్తాల్లో ఉండకూడదన్నదే తమ పోరాటం ఉద్దేశమని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రానికి 8 శాతం రాయల్టీ ఇవ్వాలన్నారు. దీనిపై ప్రధాని మోదీకి వేదిక తరఫున అర్జీ పంపించామన్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్ర చమురు నిక్షేపాలు – అంబానీ పాలు’, ‘కృష్ణా – గోదావరి గ్యాస్‌ మన హక్కు’ పుస్తకాలను నాయకులు ఆవిష్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement