జీజీహెచ్‌లో అనుమానాస్పదంగా రోగి మృతి | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో అనుమానాస్పదంగా రోగి మృతి

Jun 19 2026 12:30 AM | Updated on Jun 19 2026 12:30 AM

కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఓ రోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గ్రామీణం మండలం పనసపాడు గ్రామంలో తన పెద్ద కుమారుడు రమేష్‌ ఇంట్లో నివాసం ఉంటున్న నర్ల వెంకటరమణ (71) జ్యూట్‌మిల్‌ కార్మికుడిగా పనిచేసేవాడు. అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 12న చిన్న కుమారుడు సతీష్‌ కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువచ్చాడు. వైద్యులు పరీక్షించి టీబీ ఉందని నిర్ధారించి అడ్మిట్‌ అవ్వాలని చెప్పారు. దీంతో వెంకటరమణను 13న ఈఎన్‌టీ భవంతిలో ఉన్న టీబీ వార్డులో చేర్చారు. అప్పటి నుంచి తండ్రికి సతీష్‌ సాయంగా ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వెంకటరమణ అచేతనంగా తన మంచంపై నుంచి కింద పడి ఉండడం, అతడి మెడకు ఆక్సిజన్‌ ట్రాన్స్‌ (ప్రాణవాయువు అందించే సైలెన్‌ వంటి పైపు) బిగించి ఉండడాన్ని సహ రోగులు గమనించారు. అప్పటికి కుమారుడు సతీష్‌ వార్డు బయట ఉన్నాడు. దీంతో వారు సతీష్‌కి సమాచారం అందించారు. వైద్యులు వచ్చి పరీక్షించే సరికి అప్పటికే వెంకటరమణ మృతి చెందాడని నిర్ధారించారు. ఈ మృతి అనుమానాస్పదంగా ఉండడంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్‌ఎంఓ డాక్టర్‌ మెహర్‌ వార్డును సందర్శించి సహ రోగులను ఆరా తీశారు. తనకు ఆక్సిజన్‌ అందిస్తున్న ట్రాన్స్‌ (పైప్‌)ను సైలెన్‌ స్టాండ్‌కు కట్టి మెడకు చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అత్యంత బలహీనంగా ఉన్న ప్లాస్టిక్‌ పైప్‌తో మెడకు బిగించి ఉరి వేసుకోవడం, అందుకు తన కంటే తక్కువ ఎత్తు ఉన్న స్టాండ్‌ ఉపయోగించినట్లు కనిపించడం, అప్పటివరకు కుమారుడు అక్కడే ఉండడం, రాత్రి 1.30 సమయానికి అతడికి ఫోన్‌ రావడం, వార్డు నుంచి బయటకు వెళ్లి మాట్లాడడం వంటి అంశాలు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయని వారన్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుడికి భార్య మణి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement