చివరికి నెట్టేస్తున్నారా! | - | Sakshi
Sakshi News home page

చివరికి నెట్టేస్తున్నారా!

Jun 18 2026 12:47 AM | Updated on Jun 18 2026 12:47 AM

ప్రత్యామ్నాయ పంటలను

ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

ఆయిల్‌పామ్‌, సరుగుడు

సాగుపై ప్రచారం

వరి సాగును తగ్గించేలా అడుగులు

రెండేళ్లుగా జిల్లాలో

తగ్గుతున్న వరి విస్తీర్ణం

పిఠాపురం: ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన గోదారి సీమ వరి సాగులో వెనుకబడే పరిస్థితులు పొంచి ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు. గోదావరి, తాండవ, ఏలేరు, పంపా జలాలతో వరి సాగులో రాష్ట్రంలోనే గోదారి సీమ ప్రథమ స్థానంలో ఉంది. అటువంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఫలితంగా వరి సాగులో ఈ ప్రాంతం వెనుకబడే పరిస్థితులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

భారం దించుకోవాలని..

జిల్లాలో గత ఏడాది సుమారు 1.45 లక్షల మంది రైతులు దాదాపు 94 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. జిల్లాలో ఒక పంటకు సుమారు 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. వరి రైతులకు ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందిస్తూంటుంది. అలాగే, ఇతర రాయితీలు కూడా ఇస్తుంది. వీటితో పాటు ప్రతి పంటకూ అదునుకు సాగునీరు అందించాలి. దీనికోసం కాలువల్లో పూడికల తొలగింపు, ఇతర నిర్వహణ పరమైన పనులు చేయాలి. అలాగే, ఉచితంగా వ్యవసాయ విద్యుత్‌ అందించాలి. దీనికితోడు ఈ ప్రాంత రైతులు అధిక వరి దిగుబడులు సాధిస్తూంటారు. వారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. ఊహించని విధంగా తెగుళ్లు విజృంభించినా, ప్రకృతి విపత్తులు సంభవించినా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి. ప్రస్తుతం ఇవన్నీ భారమని భావిస్తున్న ప్రభుత్వం, దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పొమ్మనకుండానే పొగ పెట్టినట్టు.. వరి సాగుకు ఇస్తున్న సహకారాన్ని క్రమంగా తగ్గిస్తూ.. రైతులు ఆయిల్‌పామ్‌, సరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే గత రెండేళ్లలో వరి సాగు విస్తీర్ణం 9 వేల ఎకరాలకు పైగా పడిపోయింది. అనధికారికంగా ఇది మరింత అధికంగా ఉందని తెలుస్తోంది.

లాభదాయకమేనా?

వరి వంటి ఏక వార్షిక పంటలైతే పంట దిగుబడులు చేతికందిన వెంటనే రైతుకు ఎప్పటికప్పుడు ఆదాయం వస్తుంది. అదే బహు వార్షిక పంటలయిన ఆయిల్‌పా మ్‌, సరుగుడు వంటివి నాటిన తర్వాత కొన్నేళ్ల పాటు దమ్మిడీ ఆదాయం రాదు. అయినప్పటికీ వీటిని సాగు చేయాలంటూ రైతులపై రప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ నెలలో తుని మండలం చామవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆయిల్‌పామ్‌ సాగును ప్రో త్సహించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా ఖాళీ భూములను గుర్తించి ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరి, ఇతర పంటలను సైతం నిలిపివేసి ఆయిల్‌పామ్‌ సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయంటూ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాధారణంగా ఆయిల్‌పామ్‌, సరుగుడు సాగును నీటి వసతి తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తూంటారు. ఆయిల్‌పామ్‌ ఓ ఏడాది మంచి లాభాలు ఇచ్చినా.. కొన్నేళ్ల పాటు తీవ్ర నష్టాలనే మిగిల్చిందని రైతులు చెబుతున్నారు. ఆయిల్‌పామ్‌ సాగు చేస్తే నాలుగేళ్ల పాటు నయాపైసా ఆదాయం కూడా రాదు. దీనిలో అదనపు పెట్టుబడి పెట్టి అంతర పంటలు సైతం సాగు చేయాల్సి ఉంటుంది. అంత పెట్టుబడి తమ వల్ల కాదని చాలా మంది రైతులు మొత్తుకుంటున్నారు. పైగా అంతర పంటలు కూడా అంతగా ఆదాయం ఇవ్వవని చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తన స్వార్థం కోసం వరితో పాటు ఇతర పంటల సాగును నిలిపివేయించి ఆయిల్‌పామ్‌, సరుగుడు సాగును పెంచే పనిలో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.

వరి సాగు వదిలేసుకున్నా

ఎన్నో ఏళ్ల నుంచి వరి సాగు చేస్తున్నాను. ఏటా సాగునీటి ఇబ్బందులు, నకిలీ విత్తనాల బెడద, తెగుళ్లు, ఎరువుల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇన్ని కష్టాలు పడి ధాన్యం పండిస్తే ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. ఈ బాధలు పడలేక నా వరి పొలాన్ని సరుగుడు సాగుకు కౌలుకు ఇచ్చేశాను. ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు ఇస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ఆదాయం వస్తోంది. ప్రభుత్వ విధానాలు వరి సాగుకు చాలా ఇబ్బందికరంగా మారడంతో ఇతర పంటల సాగుకు తమ భూమిని రైతులు ఇచ్చేస్తున్నారు. ఎక్కడో మెట్ట ప్రాంతాల్లో మాత్రమే సాగు చేసే సరుగుడును ఇక్కడి పొలాల్లో వేస్తున్నారంటేనే వరి సాగుకు రైతులు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

– ఓదూరి వెంకటరమణ,

రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం

నష్టాలు రాకుండా చూడాలనే

విచ్చలవిడిగా రసాయనాలు వాడటం వల్ల పంటలు దెబ్బ తిని రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. వారికి మేలు చేయడానికే ఆయిల్‌పామ్‌ బహు వార్షిక పంటలకు రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పంటల మార్పిడి జరిగితే రైతుకే మంచిది. దీని అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్‌.విజయ కుమార్‌,

జిల్లా వ్యవసాయ అధికారి, కాకినాడ

జిల్లాలో వరి సాగు విస్తీర్ణం తగ్గిందిలా..

2025లో విస్తీర్ణం 93,944 హెక్టార్లు

2026లో విస్తీర్ణం 90,298 హెక్టార్లు

ఏడాదిలో తగ్గిన వరి సాగు విస్తీర్ణం 3,646 హెక్టార్లు

2025లో వరి సాగు చేసిన రైతులు సుమారు 1,45,000

వరి సాగు వదిలేసిన వారు 22,000

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement