● పలకరించిన వరుణుడు
● పెనుగాలుల బీభత్సం
● కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కొన్నాళ్లుగా దోబూచులాడుతున్న రుతుపవనాలు ఎట్టకేలకు కాస్త చురుకుదనాన్ని అందుకున్నట్టున్నాయి. జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం మేఘావృతమై, పలు ప్రాంతాలను వరుణుడు పలకరించాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ తీవ్రమైన ఎండవేడి, ఉక్కపోతతో జిల్లా ప్రజలు ఆపసోపాలు పడ్డారు. ఆ తరువాత వాతావరణం మారిపోయింది. హఠాత్తుగా పెనుగాలులు ఆరంభమై, అంతలోనే ఉరుములు, మెరుపులు, పిడుగులతో జిల్లా కేంద్రం కాకినాడతో పాటు ఏలేశ్వరం, ప్రత్తిపాడు, సామర్లకోట, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తుని, తొండంగి, పిఠాపురం తదితర ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల తాకిడికి పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గాలుల బీభత్సం చూసి ప్రజలు భీతిల్లారు. అనేకచోట్ల మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. గాలుల వేగానికి అనేక చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడిపోయాయి. ఫ్లెక్సీలు చిరిగిపోయి, ఎగిరిపోయాయి. ఏలేశ్వరంలో సుమారు రెండు గంటలకు పూగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఏలేశ్వరం – యర్రవరం ప్రధాన రహదారిపై చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. శంఖవరం మండలంలో భారీ వర్షం, ఈదురు గాలులకు అరటి తోటలు నేలకొరిగాయి. అక్కడక్కడ ఉన్న మామిడి కాయలు గాలుల వేగానికి నేల రాలాయి. కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ రోడ్డు సెంటర్‌లో మోకాలు ఎత్తున నీరు నిలిచిపోయింది. ఉప్పాడ – పిఠాపురం రోడ్డులో పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
శంఖవరం మండలం
జి.కొత్తపల్లిలో వాన
నీటి ప్రవాహం


