● ఐవీఆర్‌ఎస్ సర్వేలో
దేవస్థానానికి మూడో స్థానం
● వెల్లడించిన ప్రభుత్వం
అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం ఈ నెలలో నిర్వహించిన సర్వేలో 73 శాతం భక్తుల సంతృప్తితో అన్నవరం దేవస్థానం మూడో స్థానంలో నిలిచింది. గత నెలలో అయితే 70.7 శాతంతో ఏకంగా ఐదో స్థానానికి పడిపోగా.. ఈసారి రెండు స్థానాలు అధిగమించి మూడో స్థానానికి ఎగబాకింది. గత నెల కన్నా 2.3 శాతం ఎక్కువగా మాత్రమే భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గత మార్చి నెలలో నిర్వహించిన సర్వేలో 75 శాతం భక్తుల సంతృప్తితో అన్నవరం దేవస్థానం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత నుంచి ఆ ర్యాంకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత నెల 15 నుంచి ఈ నెల 15వ తేదీ వరకూ వాట్సాప్ యాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలపై నిర్వహించిన ఈ సర్వేలో 75.8 శాతం భక్తుల సంతృప్తితో శ్రీకాళహస్తి మొదటి, 74.2 శాతంతో ద్వారకా తిరుమల రెండు స్థానాల్లో నిలిచాయి. వరుసగా తరువాతి స్థానాల్లో సింహాచలం, కాణిపాకం, విజయవాడ, శ్రీశ్రీలం దేవస్థానాలు నిలిచాయి.
ఏరియా ఆస్పత్రిలో
అరుదైన శస్త్రచికిత్స
తుని: కడుపు నొప్పితో బాధ పడుతున్న ఓ మహిళకు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి, 5.4 కిలోల కణితి తొలగించారు. డీసీహెచ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ మహేష్ కథనం ప్రకారం.. తుని పట్టణానికి చెందిన ప్రియ అనే మహిళ కొన్ని రోజులుగా నొప్పి, కడుపు పొంగడం, విరేచనం మందగించడం, నీరుడు ఇబ్బందితో బాధపడుతోంది. ఈ నెల 8న ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఆమెకు జనరల్ సర్జరీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గర్భాశయం నుంచి 30x25x20 పరిమాణంలో భారీ కణితి ఉందని, ఇది రక్తనాళం, యూరినరీ ట్యూబ్, పేగులపై పడి పై సమస్యలు వచ్చాయని గుర్తించారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చుకున్నారు. రక్తం తక్కువగా ఉండటంతో నాలుగు ప్యాకెట్లు ఎక్కించి, బుధవారం డాక్టర్ మహేష్ ఆధ్వర్యాన ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి, కణితి తొలగించారు. మత్తు వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ, దినేష్, జనరల్ సర్జన్ అమల, గణపతిరావు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రియ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్ మహేష్ చెప్పారు.
వేద పండితుల పరీక్షలు
విజయవంతం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రముఖ ఆలయాల్లో వేద పండితుల నియామకానికి విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్‌వీ రమేష్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు జోన్లకు కలిపి 262 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 230 హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షల ఫలితాలు రెండు నెలల్లో విడుదలవుతాయన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని అన్నవరం, సింహాచలం, వాడపల్లి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వేద పండితులుగా, వేద పారాయణదారులుగా నియమిస్తామని తెలిపారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో రత్నగిరి బుధవారం రద్దీగా మారింది. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో, క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం సందడిగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణునికి, గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణలు చేశారు. సత్యదేవుని వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు.


