‘బిడ్డను మోసే తల్లే వీవీఐపీ’ | - | Sakshi
Sakshi News home page

‘బిడ్డను మోసే తల్లే వీవీఐపీ’

Jun 18 2026 12:47 AM | Updated on Jun 18 2026 12:47 AM

చాగంటి కోటేశ్వరరావు

మాతాశిశు విభాగ భవన

నిర్మాణ దాతలకు సత్కారం

కాకినాడ క్రైం: కడుపులో బిడ్డను మోసే తల్లే వీవీఐపీ అని, ఆమెను కాదని ప్రాధాన్యం ఇవ్వాల్సిన వ్యక్తులెవరూ ఉండరని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్‌)లో కొత్తగా నిర్మించిన బొల్లినేని వెంకమ్మ, రమణయ్య మాతా శిశు విభాగం (ఎంసీహెచ్‌) నిర్మాణానికి రూ.62 కోట్ల విరాళాలిచ్చిన దాతలను రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) ఆడిటోరియంలో బుధవారం రాత్రి ఘనంగా సత్కరించారు. రంగరాయ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (రామ్‌కోసా) ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో చాగంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతన భవంతిలో ప్రసవించే ప్రతి తల్లి ఆశీస్సులు దాతలకు, వారి కుటుంబాలకు దక్కుతాయని అన్నారు. ఎన్నోచోట్ల శిశువులను ఎలుకలు కొరకడం, ప్రసవానంతరం సదుపాయాలు లేక తల్లి కష్టాలు పడటం, ఒకే మంచంపై ఇద్దరు గర్భిణులను ఉంచి, చికిత్స చేయడం తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ముఖ్య అతిథి రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ అత్తలూరి విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ, ఎందరో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నూతన ఎంసీహెచ్‌ బ్లాక్‌, అందులోని పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కిమ్స్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ బొల్లినేని బొల్లినేని భాస్కరరావు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హరీంధర్‌ ప్రసాద్‌, ఎంసీహెచ్‌ కమిటీ చైర్మన్‌ ఎ.వెంకట సుబ్బరాయ చౌదరి, రామ్‌కానా బోర్డ్‌ చైర్మన్‌ కలిదిండి విష్ణువర్మ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లావణ్య కుమారి, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ ఉషాకిరణ్‌, రామ్‌కోసా అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ ఆనంద్‌, ఆదిత్య సత్య ప్రసన్న, విశ్రాంత డీఎంఈ డీఎస్‌వీఎల్‌ నరసింహం తదితరులు పాల్గొన్నారు.

నీట్‌ అభ్యర్థులకు

ఉచిత ప్రయాణం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 21న జరిగే నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంయూవీ మనోహర్‌ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డీనరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందన్నారు. విద్యార్థులు హాల్‌ టికెట్టు చూపించి ప్రయాణించవచ్చని మనోహర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement