అన్నవరం: భారతమాల పథకం కింద కాకినాడ సమీపంలోని వాకలపూడి లైట్‌హౌస్ నుంచి అన్నవరం వరకూ 41 కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి (ఎన్‌హెచ్– 516ఎఫ్) నిర్మాణం చురుకుగా సాగుతోంది. దీని నిర్మాణానికి అన్నవరంలో సేకరించిన భూమికి రైతులు కోరిన విధంగా కాకుండా గతంలో నిర్ణయించినట్టు 9 శాతం వడ్డీతో పరిహారం చెల్లించారు. దీంతో, పనులు ఊపందుకున్నాయి. అన్నవరం, తొండంగి మండలంలోని ఎ.కొత్తపల్లి, కోదాడ, యు.కొత్తపల్లి మండలాల మీదుగా నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా ఈ హైవే నిర్మిస్తున్నారు.
2021లోనే శ్రీకారం
సాగర తీరం వెంబడి పారిశ్రామికాభివృద్ధికి భారత్‌మాల పరియోజన ఫేజ్–1 రహదారిని రూ.1,040 కోట్లతో నిర్మించేందుకు 2020లోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 2021లో ఒకసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసింది. తిరిగి గత ఏడాది జూలైలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పట్లో అరవిందో రియాల్టీ కంపెనీ టెండర్ అత్యంత తక్కువకు టెండర్ దాఖలు చేసింది. అయినప్పటికీ సాంకేతిక కారణాలతో దానిని రద్దు చేసి, అదే సంవత్సరం ఆగస్టులో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి 9 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా రాయలసీమలోని కూటమి ఎమ్మెల్యేకి చెందిన కాంట్రాక్టు సంస్థ దీనిని దక్కించుకుంది.
225 హెక్టార్ల భూ సేకరణ
ఈ రహదారి నిర్మాణానికి రైతుల నుంచి 195 హెక్టార్లు సేకరించారు. మరో 45 హెక్టార్లు ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 225 హెక్టార్ల భూమి సేకరించారు. ఇందులో అన్నవరం, ఆరెంపూడి రైతులకు చెందిన 12 ఎకరాలున్నాయి. ఆరెంపూడి రైతులకు పరిహారం చెల్లించినా, అన్నవరం రైతులకు చెల్లించడానికి ఐదేళ్లు పట్టింది.
రహదారి నిర్మాణం ఇలా..
వాకలపూడి లైట్‌హౌస్ నుంచి కాకినాడ రూరల్, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల మీదుగా 516ఎఫ్ రహదారి నిర్మిస్తున్నారు. ఇది అన్నవరం సమీపాన రాజమహేంద్రవరం – విశాఖపట్నం మార్గంలోని సత్యదేవుని నమూనా ఆలయం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారికి కలుస్తుంది. మొత్తం 21 గ్రామాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రహదారి పొడవునా 169 బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు, ఓవర్ పాస్‌లు నిర్మించనున్నారు. అలాగే, చైన్నె – హౌరా రైల్వే లైన్ మీద అన్నవరం వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తారు. యు.కొత్తపల్లి వద్ద టోల్ ప్లాజా నిర్మించనున్నారు. 2027 డిసెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
చురుగ్గా అన్నవరం–వాకలపూడి
రహదారి నిర్మాణం
ఎన్‌హెచ్–516ఎఫ్
గ్రీన్‌ఫీల్డు రోడ్డుగా నామకరణం
రూ.1,040 కోట్లతో
41 కిలోమీటర్ల పొడవున నిర్మాణం
అన్నవరం వద్ద హైవేను
కలుపుతూ భారీ ఫ్లై ఓవర్
2027 డిసెంబర్‌కు పూర్తి చేసేలా కసరత్తు


