కాకినాడ క్రైం: రంగరాయ వైద్య కళాశాలలో చదువుకుని, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కళాశాల రుణం తీర్చుకోవాలనుకున్నారు. తాము సంపాదించిన దానిలో రూ.కోట్లు దానమిచ్చి స్థానిక జీజీహెచ్‌లో మాతాశిశు విభాగం నిర్మించారు. అటువంటి దాతలకు ప్రభుత్వం విలువ లేకుండా చేసి, తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఏం జరిగిందంటే..
జీజీహెచ్‌లో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన మాతా శిశు విభాగం బ్లాక్‌కు ప్రభుత్వం కేవలం రూ.11 కోట్ల అరకొర నిధులిచ్చి అసంపూర్తి నిర్మాణంగా వదిలేసింది. దీంతో, రంగరాయ మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (రామ్‌కోసా) అనుబంధ రామ్‌కానా ప్రతినిధులు 260 మంది ముందుకు వచ్చి ఏకంగా రూ.62 కోట్లు అందించి దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నట్టు రామ్‌కానా ప్రతినిధులకు సీఎంఓ నుంచి సమాచారం ఇచ్చారు. దీంతో, రూ.కోట్ల విరాళాలు ఇచ్చిన వారిలో 140 మంది కుటుంబాలతో కలసి ఈ కార్యక్రమానికి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. నాలుగైదు రోజులు ముందే జిల్లాకు వచ్చి, అయిన వారి ఇళ్లు, హోటళ్లలో దిగారు. దీనికి గాను వారికి సుమారు రూ.2.50 కోట్ల మేర చేతి చమురు వదిలిపోయింది. తీరా చూస్తే ఈ భవనం ప్రారంభోత్సవానికి సీఎం రావడం లేదని చూచాయగా తెలియడంతో వారంతా కంగుతిన్నారు. భవన నిర్మాణం 80 శాతం మేర మాత్రమే పూర్తికావడంతో సీఎం రావడం లేదని తెలుస్తోంది. అయితే, ఈ విషయం ప్రారంభోత్సవ తేదీ ఖరారైనప్పుడు తెలియలేదా, వ్యయ ప్రయాసలకోర్చి వచ్చిన తామంటే సీఎంకు ఏమాత్రం విలువలేదా అని దాతలు ప్రశ్నిస్తున్నారు.
సన్మానించి పంపాలని...
ముఖ్యమంత్రి నిర్వాకంతో రామ్‌కోసా పెద్దలు రగిలిపోతున్నారు. ఎన్‌ఆర్‌ఐల ఎదుట తలెత్తుకోలేని పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన దాతలకు బుధవారం సాయంత్రం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో సన్మానం ఏర్పాటు చేశారు. రూ.కోట్లు వెచ్చించి ప్రారంభోత్సవానికి వచ్చిన వారిని చివరకు సన్మానంతో బుజ్జగించి పంపాల్సిన పరిస్థితి ఎదురైంది.
సీఎం చంద్రబాబు నిర్ణయంతో
దాతల్లో అసంతృప్తి
కాకినాడ జీజీహెచ్‌లో 18న జరగాల్సిన ఎంసీహెచ్ బ్లాక్ ప్రారంభోత్సవం వాయిదా
నిర్మాణానికి రూ.62 కోట్ల
సాయం చేసిన పూర్వ విద్యార్థులు
కార్యక్రమానికి నాలుగైదు రోజుల ముందుగానే చేరుకున్న దాతలు
ఇందుకోసం రూ.2.5 కోట్లు
వెచ్చించిన ఎన్‌ఆర్‌ఐలు
నేడు దాతలకు సన్మానంతో
సరిపెడుతున్న నిర్వాహకులు


