హెల్దీ క్యాంపస్‌లుగా వసతిగృహాలు | - | Sakshi
Sakshi News home page

హెల్దీ క్యాంపస్‌లుగా వసతిగృహాలు

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో, ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లను ‘నెట్‌ జీరో – హెల్తీ క్యాంపస్‌లుగా అభివృద్ధి చేయడంతో పాటు సంతృప్త స్థాయిని పెంచేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమం వసతి గృహాల అధికారులతో ఆయన సమీక్షించారు. సోక్‌ పిట్స్‌ ద్వారా ఉపయోగించిన నీటిని తిరిగి వినియోగించే చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి నాణ్యత, పరిశుభ్రత ఆర్‌ఓ వ్యవస్థల ద్వారా తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, నీటి నమూనాలను పరీక్షించాలన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎ.శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి ఎ.శ్యామల కుమారి, గురుకుల పాఠశాల సమన్వయకర్త రాజకుమారి, మైనారిటీ సంక్షేమ అధికారి షేక్‌ మహబూబ్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.

ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి

జిల్లా కేంద్రం కాకినాడతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో డివైడర్లు, కూడళ్లలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నిటినీ వెంటనే తొలగించాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ మున్సిపల్‌ కమిషనర్లను మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. పట్టణాల్లోని రహదారుల మధ్య స్తంభాలపైన, రద్దీగా ఉండే కూడళ్లలో స్థానిక సంస్థల నుంచి ఎటువంటి అనుమతి లేకుండా అస్తవ్యస్తంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు వాహన చోదకులకు, పాదచారులకు పరిసరాలు కనబడకుండా అవరోధంగా నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. నిత్యం వీటిపై ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఫ్లెక్సీలన్నిటినీ వెంటనే తొలగించి అందుకు అయిన ఖర్చును, అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ప్రదర్శించినందుకు జరిమానాలను వాటిని ఏర్పాటు చేసిన వారి నుంచి వసూలు చేయాలని కమిషనర్లను కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement