వృథాతథం! | - | Sakshi
Sakshi News home page

వృథాతథం!

Jun 16 2026 12:40 AM | Updated on Jun 16 2026 12:40 AM

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌ పర్యవేక్షిస్తున్న విద్యాశాఖలో నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. క్రమం తప్పకుండా విద్యా క్యాలండర్‌ ప్రకటిస్తున్నా అమలు చేయడంలో ఆ శాఖ పూర్తిగా విఫలమవుతోంది. గత ఏడాది నవంబర్‌ వరకూ ఇంజినీరింగ్‌, డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించిన ప్రభుత్వం ఈ ఏడాది అదే పంథా కొనసాగించేలా కనిపిస్తోంది. దీంతో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసిన అభ్యర్థుల సమయం దాదాపు ఆరు నెలల పాటు వృథా అవుతోంది. ఇంటర్మీడియెట్‌ పూర్తయ్యాక చాలామంది అభ్యసించే విద్య ఇంజినీరింగ్‌. ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్‌ మే నెలలో నిర్వహించారు. ఇప్పటి వరకూ ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థులు నిరుత్సాహ పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌, ఫార్మశీ విభాగానికి సంబంధించి 25వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రంలో తరగతులు ప్రారంభమయ్యే సూచనలు ఎక్కడా కనిపించడంలేదు. ఈ నెల 10వ తేదీలోపు అనుబంధ గుర్తింపు చేయాలని, ప్రవేశాలు పొంది, వాటిని రద్దు చేసుకున్న విద్యార్థులకు జూలై 20లోపు ఫీజు తిరిగి ఇచ్చేయాలని ఏఐసీటీ సూచించింది. మిగిలిపోయిన సీట్లలో విద్యార్థులను చేర్చుకోవడానికి ఆగస్టు 14 చివరి తేదీగా ప్రకటించింది. అయితే ఏపీలో ఇంకా ఏపీఈఏపీసెట్‌ ఫలితాలే విడుదల కాలేదు. కళాశాలల అఫిలియేషనూ పూర్తికాలేదు. దీంతో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

కొత్త ఫీజుల నిర్ణయంలో తీవ్ర జాప్యం

మూడేళ్లకోసారి డిగ్రీ, సాంకేతిక విద్య, ఫార్మశీ, వైద్య విద్య కళాశాలలకు ఫీజు నిర్ణయించాలి. మూడేళ్ల కాలపరిమితి 2025–26తో ముగిసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం 2026–27 నుంచి మూడేళ్లకు ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇంతవరకూ ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, కమిషన్‌ చైర్మన్‌, సభ్యులనే నియమించలేదు. సభ్యుల ఎంపికకు తాజాగా నోటిఫికేషన్‌ రాగా పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటయితే కొత్త ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. యాజమాన్య కోటా ప్రవేశాలకు ఈ ఫీజులే ప్రామాణికం. కొత్త ఫీజులు నిర్ణయించకపోతే పాత ఫీజులతోనే ప్రవేశాలు నిర్వహించాల్సి వస్తుంది.

ఇంప్రూవ్‌మెంట్‌తో ఆలస్యం

ఇంటర్మీడియెట్‌ రెండో ఏడాదిలో మార్కుల మెరుగుకోసం ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే ఈ ఏడాది అవకాశం కల్పించారు. ఈఏపీ సెట్‌లో 25 శాతం ఇంటర్మీడియెట్‌ మార్కులకు వెయిటేజీ ఉన్నందున ఈ మార్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెల ఐదవ తేదీతో అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ జవాబు పత్రాల మూల్యంకనానికి 12 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. వీటి ఆధారంగా ఈఏపీ సెట్‌లో ర్యాంకులు కేటాయించాలి.

ఫలితాలు సిద్ధం

ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాం. ఇంటర్మీడియెట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఫలితా లు వచ్చిన వెంటనే ర్యాంకులు సిద్ధం చేసి, ప్రభు త్వం నుంచి అనుమతి రాగానే విడుదల చేస్తాం.

– ప్రొఫెసర్‌ ఎన్‌.మోహనరావు,

కన్వీనర్‌ ఈఏపీ సెట్‌

ఈఏపీ ఫలితాలకు ఎదురుచూపులు

మరింత ఆలస్యం కానున్న

ఇంజినీరింగ్‌ తరగతులు

గతేడాది నవంబర్‌ వరకూ

సాగిన అడ్మిషన్ల ప్రక్రియ

ఆరునెలల పాటు వృథా కానున్న

విద్యార్థుల సమయం

ఈ సంవత్సరమూ అదే తంతు

ఉమ్మడి జిల్లాలో 25 వేల

మంది అభ్యర్థుల నిరీక్షణ

కళాశాలల అఫిలియేషన్‌లోనూ..

ఇంజినీరింగ్‌ కళాశాలలకు సంబంధిత పరిధిలోగల యూనివర్సిటీలు అఫిలియేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ అనుమతులు పొందిన యాజమాన్యాలు అఫిలియేషన్‌ కోసం వర్సిటీకి దరఖాస్తు చేసుకుంటాయి. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు తనిఖీ చేసి అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐసీటీ సూచనల ప్రకారం ఈనెల 10వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తికావాలి. కానీ ఇంతవరకూ ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రంలో కీలకంగా ఉన్న జేన్‌టీయూ కాకినాడ పరిధిలో అత్యధికంగా ఐదు జిల్లాలకు సంబంధించి 160 కళాశాలల ఉన్నాయి. ఈ వర్సిటీకి సంబంధిత కళాశాలలు చెల్లించాల్సిన రుసుములు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వీటిలో కనీసం సగం అయినా చెల్లించాలని వర్సిటీ అధికారులు కోరుతున్నా స్పందించడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement